అమెరికా నుంచి టీచర్లను రప్పించి… పిల్లలకు శిక్షణ

by Shyam |
అమెరికా నుంచి టీచర్లను రప్పించి… పిల్లలకు శిక్షణ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన టీచర్ ప‌ద్మ‌ప్రియను హైద‌రాబాద్ నగర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ఆదివారం ఘనంగా స‌న్మానించారు. ఈ మేరకు సీపీ స్వ‌యంగా ఆమె ఇంటికి వెళ్లి అభినంద‌న‌లు తెలపి, బొకేను అందించి, సీడ్ గ‌ణేష్‌ను బ‌హుక‌రించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… బోధన అనేది సృజనాత్మకత అని, ఇదే సూత్రాన్ని పాటించి పేద పిల్లల నేస్తంగా మారిన ఉపాధ్యాయురాలు ప‌ద్మ‌ప్రియ‌ అని కొనియాడారు. తన వద్ద చదువుకుంటున్న పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో చూడాలన్న ఆకాంక్షతో, అమెరికా నుంచి టీచర్లను రప్పించి పిల్లలకు శిక్షణ ఇప్పిస్తోందన్నారు.

అంతేగాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రష్యా, ఫిలిఫ్పీన్స్‌, ఇంగ్లాండ్‌, జంబియా తదితర దేశాల్లోని పిల్లలతో తమ పాఠశాల పిల్లలను మాట్లాడిస్తోందని తెలిపారు. దీని ద్వారా ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తాము నిలదొక్కుకోగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు.

ఆమె చేసిన ప్రయత్న ఫలితంగా ఒకప్పుడు గణితమంటే భయపడే వారంతా ఇప్పడు గణితపాఠాలను ఆసక్తిగా వింటున్నారనీ, గణిత ఆటలను ఆడుకుంటూ పాఠ్యాంశాలను నేర్చుకుంటున్నారనీ అన్నారు. ఇలాంటి వినూత్న బోధనా పద్ధతులను అనుసరించినందుకు గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యారని, ఆమెను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులు ఎంచుకుని విద్యార్థులకు జీవిత కాలంలో గుర్తుండి పోయేలో బోధన చేయాలని సీపీ సూచించారు.

Advertisement

Next Story