హైటెక్ ఫార్మింగ్.. మన హైదరాబాద్‌లోనే..!

by Anukaran |
హైటెక్ ఫార్మింగ్.. మన హైదరాబాద్‌లోనే..!
X

దిశ, ఫీచర్స్ : వ్యవసాయంలో పెరిగిన టెక్నాలజీ వాడకం, నూతన ఫార్మింగ్ విధానాలు, ఆర్గానిక్ సాగుపై పెరుగుతున్న అవగాహన.. ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, యువత ఫార్మింగ్‌పై దృష్టిసారించేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తోంది. ఈ మేరకు సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకుని, మార్కెటింగ్ చేయడం తెలిస్తే.. ‘వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేయవచ్చని ఎంతోమంది యువ రైతులు ఇప్పటికే నిరూపించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు సచిన్, శ్వేత.. తమ వ్యవసాయ క్షేత్రంలో ‘సింప్లీ ఫ్రెష్’ బ్రాండ్‌తో కూరగాయలు పండిస్తున్నారు. ఈ క్రమంలో మొక్కమొక్కకు, విత్తు విత్తుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ‘పెస్టిసైడ్ ఫ్రీ వెజీస్’ అందిస్తున్న వారి ఫామ్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సచిన్ దర్బార్వార్.. ఇంజనీరింగ్ తర్వాత, దాదాపు 18 సంవత్సరాల పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. భారీ మొత్తంలో సంపాదిస్తూ, విదేశాల్లో హై ఫై లైఫ్ లీడ్ చేస్తున్నా.. మనసు మాత్రం ఇండియాపైనే ఉండేది. ఇక్కడకు రావాలని ఉన్నా, వచ్చాక ఏం చేయాలన్న విషయంపై సచిన్‌కు క్లారిటీ లేకపోయేది. అయితే అప్పటికే ఆస్ట్రేలియాలో రైతులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఫార్మింగ్‌లో మంచి దిగుబడులు సాధించడం సచిన్‌ను ఆకర్షించింది. ఇదే తరహాలో తను కూడా వ్యవసాయంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ‘టాకింగ్ టు ప్లాంట్స్’ అనే కాన్సెప్ట్‌తో 2013లో హైదరాబాద్, శామీర్‌పేట్‌లోని పది ఎకరాల స్థలంలో తన భార్య శ్వేతతో కలిసి ‘సింప్లీ ఫ్రెష్’‌ను ప్రారంభించాడు. రసాయనాలు, పురుగుమందులు లేని పోషకాహారం అందించడమే లక్ష్యంగా.. సేంద్రియ విధానంలో పండించిన శుభ్రమైన తాజా కూరగాయలు అందిస్తున్నారు. దీన్ని ధృవీకరించేందుకు ‘సింప్లీ ఫ్రెష్’కు క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టి, వినియోగదారులందరికీ ఓపెన్ యాక్సెస్ ఇచ్చారు. ప్రతి ప్యాక్ ప్యాకెట్‌‌పై గల క్యూఆర్ కోడ్‌ను వినియోగదారులు వెబ్‌సైట్‌లో స్కాన్ చేసి, మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

టాకింగ్ టు ప్లాంట్స్

టెక్ సాయంతో వ్యవసాయ క్షేత్రంలోని వాతావరణాన్ని నియంత్రించిన సచిన్.. ప్రతీ దశలో మొక్క పెరుగుదలను మానిటర్ చేయడంతో పాటు మొక్కలకు అందిస్తున్న న్యూట్రిషన్స్‌ను రికార్డ్ చేశాడు. అవి ఎంతమేరకు మొక్కకు చేరుతున్నాయి, దానివల్ల లాభముందా లేదా? చెక్ చేయడంతో పాటు గ్రీన్‌హౌస్‌లోని వాతావరణానికి మొక్కలు ఎలా స్పందిస్తున్నాయో పరిశీలించేవాడు. ఈ క్రమంలో తన కాన్సెప్ట్‌పై మరింత తెలుసుకోవడానికి వీలుగా వృక్షశాస్త్రజ్ఞులు, ప్రొఫెసర్లు, రైతులు ఇతరులతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఈ మేరకు మొక్కలు 12 వేర్వేరు పోషకాలను తీసుకుంటాయని, వాటి పెరుగుదల దశ ఆధారంగా ఆయా పోషకాల అవసరమవుతాయని తెలుసుకున్నాడు. కాగా వేసవిలో మనం ఆయిలీ(నూనె పదార్థాలు) గ్రీసీ (జిడ్డైన ఆహారం) పదార్థాలకు ఎలా దూరంగా ఉండాలనుకుంటున్నామో, మొక్కలు కూడా వేసవి నెలల్లో పర్టిక్యులర్ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటాయని గ్రహించాడు. ఇలా మొక్కలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సచిన్, శ్వేత టెక్నాలజీ సాయం తీసుకున్నారు.

మా తాత ఓ రైతు. మా నాన్న అటువైపు వెళ్లకపోయినా, వ్యవసాయం నా డీఎన్ఏలో ఉందని అనుకుంటున్నా. ఇండియాలో ఫామ్ ఏర్పాటు చేసే ముందు ఆస్ట్రేలియాలో ఓ ప్రొటోటైప్(నమూన) తయారు చేశాం. మొదటి ప్రాజెక్టులో భాగంగా ఇండియాలో 4 ఎకరాల సాగుతో మొదలుపెట్టాం. మేము దాదాపు 150 రకాల కూరగాయలు, హెర్బ్స్ (మూలికలు) మొక్కలను పెంచాం. నాణ్యత, తాజాదనంతో కూడిన కూరగాయలను కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అందులోనూ మేం ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడటం లేదు. ఇలా పండించిన వాటిని సూపర్ మార్కెట్లు, హోటళ్ళతో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న వివిధ సంస్థలకు కూడా సరఫరా చేస్తున్నాం. ఇక ఔషధ సంస్థలతో కలిసి పనిచేసేటప్పుడు వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మొక్కలు అందించాలి. ఈ విషయంలో మేము ఓ క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీని ఆధారంగా ఎవరు విత్తనాలు వేశారు, ఆ సమయంలో ఏ వాతావరణ పరిస్థితులు ప్రబలంగా ఉన్నాయి? దాని నిర్వహణ ఎలా ఉంది, పండించినప్పుడు బరువు ఎంత ఉంది? మొదలైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.- సచిన్, సింప్లి ఫ్రెష్ యజమాని

‘14 రకాల పాలకూరలు, 10 రకాల మూలికలతో పాటు టమోటా, క్యాప్సికమ్, మిరియాలు, వివిధ మైక్రోగ్రీన్స్‌తో తొలిసారిగా మా ‘సింప్లీ ఫ్రెష్’ ప్రస్థానం మొదలైంది. మేము ప్రతి మొక్కను సూక్ష్మంగా ప్రొఫైల్ చేశాం. డే వన్ నుంచి పంట కోసే వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో వాటి పోషక అవసరాలను అర్థం చేసుకున్నాం. పుట్టినప్పటి నుంచి పిల్లలు ఎదిగే వరకు వారి న్యూట్రిషనల్ నీడ్స్ మారుతుంటాయి. అదే విధంగా మొక్కలకు కూడా వాటి లైఫ్ సైకిల్ క్రమంలో వేర్వేరు పోషకాలు అవసరమవుతాయి. 2018 నుంచి పసుపు, అల్లం, అశ్వగంధ కూడా పండిస్తున్నాం. సిద్దిపేటలోని అర్జున్‌పట్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో మా సింప్లీ ఫ్రెష్‌ను 2018లో విస్తరించాం. ప్రతి రోజూ 8 వేల కిలోల వెజిటేబుల్స్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇక మా సంస్థలో మొత్తంగా170 మంది ఉద్యోగులుండగా, స్థానికులకే అవకాశాలు కల్పించాం’ – శ్వేత, సింప్లి ఫ్రెష్ కో ఫౌండర్

Advertisement

Next Story

Most Viewed