పుకార్లు నమ్మోద్దంటూ పోలీసుల ప్రచారం

by Shyam |
పుకార్లు నమ్మోద్దంటూ పోలీసుల ప్రచారం
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిపై వదంతులు, పుకార్లు నమ్మోద్దంటూ నగర పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఒకే చోట వ్యక్తులు గుమిగూడి ఉండొద్దంటూ వ్యక్తిగత పరిశుభ్రత, తగిన జాగ్రత్తలతో నివారణ చర్యలు పాటించాలని చెపుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలకు ముందస్తుగా దాదాపు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సినిమా హాళ్ళు వంటి జన సంచారం కలిగిన ప్రదేశాలను సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, నగరంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, పుకార్లను నమ్మవద్దంటూ నగర పోలీసులు ప్రత్యేక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన కూడళ్ళ వద్ద మైక్ ప్రచారం నిర్వహిస్తోంది. కరోనా వైరస్ నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దగ్గు.. తమ్ములు వచ్చే సమయంలో నోటి వద్ద, ముక్కు దగ్గర జేబు రుమాలు పెట్టుకోవాలని మైక్ ద్వారా చెపుతున్నారు. అంతే కాదు.. కరోనా పట్ల వదంతులను, పుకార్లను ప్రచారం చేసినవారికి విపత్తుల నిర్వహణ- 2005 చట్టం సెక్షన్ 54 ప్రకారం శిక్షార్హులు అవుతారని, పుకార్లను ప్రచారం చేసే వారిపట్ల పోలీసులు కశ్చితంగా చర్యలు తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూర్, ఖాజాగూడ, గౌలిదొడ్డి ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్ళలో మైక్ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇవే విషయాలను నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి హ్యాండ్ శానిటైజేన్ ను ఏర్పాటు చేసింది. నగరంలోని పౌరులు ఏ పోలీస్ స్టేషన్ కు వివిధ పనుల నిమిత్తం వెళ్ళినా.. వెంటనే అక్కడి సిబ్బంది ముందుగా హ్యాండ్ శానిటైజన్ అందిస్తున్నారు.

Tags: Carona Virus, Cyberbad Police, Hyderabad City Police Awareness

Advertisement

Next Story

Most Viewed