కేసీఆర్‌కు భారీ షాక్ ఇచ్చిన ఈటల.. సీఎంకు తలనొప్పిగా మారిన హుజురాబాద్.!

by Sridhar Babu |   ( Updated:2021-07-26 06:28:43.0  )
Eatala-Rajender-Vs-TRS
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధిష్టానానికి ఓ పాఠం నేర్పారా.? ఆయన కారణంగా ప్రాక్టికల్‌గా ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అన్వేషించాల్సిన పరిస్థితి తయారైందా అంటే అవుననే అంటున్నాయి నెలకొన్న పరిస్థితులు. ఇంతకీ ఈటల టీఆర్ఎస్ బాస్‌కు ఇచ్చిన ట్విస్ట్ ఏంటీ..? అధిష్టానం చేయాల్సిన పనేంటో తెలుసా.?

ఏప్రిల్ 30న రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేసిన ఘటన ఈటల రాజేందర్ అసైన్డ్ భూముల వ్యవహరం. ఆ తరువాత ఆయన మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, మే ఒకటి నుంచి ప్రత్యామ్నాయ నాయకుని కోసం కొనసాగుతున్న అన్వేషణలో నేటికీ ఎవరూ దొరక్కపోవడం టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడుపడకుండా తయారైంది.

86 రోజులైనా ధీటైన అభ్యర్థి మాత్రం దొరక్కపోవడం విస్మయం కల్గిస్తోంది. ఎన్నో సర్వేలు, నిఘా వర్గాల నివేదికలు తెప్పించుకున్నా ఫలితం.. ఈటలను ఓడించే నాయకుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. చివరకు అధిష్టానం రంగంలోకి దిగి గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నా.. బరిలో నిలిపే అభ్యర్థి గెలుస్తాడన్న ధీమా మాత్రం రావడం లేదని తెలుస్తోంది. ఈటల ఇచ్చిన ఈ ఝలక్ వల్ల అగ్ర నాయకత్వం అంతర్మథనంలో పడ్డట్టే అయింది.

నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకుడు ఎదగకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గుర్తించిన నాయకులు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలోనన్న ఆలోచనలో పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు హుజురాబాద్ అంటే ఈటల, ఈటల అంటే టీఆర్ఎస్ అన్న పరిస్థితులు స్థానికంగా నెలకొనడంతో మరో నాయకుడు ఎదగలేదన్నది వాస్తవం. సడన్‌గా జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్‌కు ఆల్టర్ నేట్ లీడర్ హుజురాబాద్‌లో దొరక్కపోవడం అధికార పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది.

అనుభవం నేర్పిన పాఠంతో..

ఈటల ఎపిసోడ్ నేర్పిన పాఠంతో ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచి పోషించాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఎదురైంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో తెలియని పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతీ నియోజకవర్గంలో ఆల్టర్ నేట్ లీడర్‌ను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రతీ నియోజకవర్గంలో బలమైన నాయకులను తయారు చేసుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఏక ఛత్రాదిపత్యం చెలాయిస్తున్న నాయకులకు ధీటుగా మరో నాయకున్ని సిద్ధం చేసుకుంటే హుజురాబాద్ అనుభవాలు మరో చోట ఎదురు కావన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సైలెంట్ మూవ్‌మెంట్..?

అయితే, అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకులను ప్రోత్సహించే విషయంలో సైలెంట్ మూవ్‌మెంట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలను కాదని మరో నాయకుడిని తయారు చేయాలంటే ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్న ఇంచార్జీలు నారాజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా అధిష్టానంపై ఉంటుంది. దీంతో, యాక్టీవ్ లీడర్స్ నిరుత్సాహానికి గురి కాకుండా కొత్త వారిని తయారు చేసేందుకు పావులు కదిపే పనిలో అగ్ర నాయకత్వం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed