ఆ ఐదుగురిలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

by Sridhar Babu |   ( Updated:2021-07-13 01:45:01.0  )
huzurabad-name 1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ అది. ఓ మంత్రితో పాటు మరో 12 మంది నాయకులు వేర్వేరు వాహనాల్లోకి రయ్ మంటూ వెళ్లిపోయారు. తిరిగి రాత్రి 10.35 నిమిషాలకు వారంతా బయటకు వచ్చారు. ఇంతకీ ఐదున్నర గంటల పాటు ప్రగతి భవన్ లో జరిగిందేమిటీ.? వీరితో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన చర్చలు ఏమిటీ అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఓ మంత్రితో కలిసి ప్రగతి భవన్ లోకి వెళ్లారు. వీరితో సుదీర్ఘంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు, అభ్యర్థుల బలబలాల గురించి కులంకశంగా చర్చించినట్టు సమాచారం.

ఐదుగురిపైనే చర్చ…

హుజురాబాద్ లో ఈటలపై పోటీ చేయించేందుకు ఫైనల్ గా ఐదుగురి పేర్లు సీఎం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరిలో ముద్దసాని మాలతి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, స్వర్గం రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ల పైనే ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ప్రగతిభవన్ లో జరిగిన చర్చలో కూడా ఈ ఐదుగురి గురించే ప్రస్తావించినట్టు సమాచారం. వీరిలో ఎవరైతే బావుంటుంది అన్న విషయంపై సమగ్రంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

వారంలో అభ్యర్థి ప్రకటన..?

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని వారం రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా ఐదుగురిలో బలమైన అభ్యర్థిని గుర్తించి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడకముందే తమ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్లి ఈటల గ్రాఫ్ ను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed