వీళ్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాదా.. భర్త చాటు భార్యలేనా..!

by Anukaran |
వీళ్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాదా.. భర్త చాటు భార్యలేనా..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహానగరంలో మహిళా కార్పొరేటర్ల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. పేరుకే కార్పొరేటర్లు అయినా పెత్తనమంతా పతుల చేతుల్లోనే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని అధికారిక కార్యక్రమాల్లో కార్పొరేటర్లకు బదులు.. భర్తలు హాజరవుతుండడం జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లలో ఉన్న 150 వార్డులకు 2020 డిసెంబర్ 1న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 50 శాతం మహిళలకే రిజర్వేషన్లు కేటాయించారు. మొత్తం150 డివిజన్లలో 75 స్థానాల్లో మహిళలకే అవకాశం ఇవ్వగా.. దేదీప్యారావు (వెంగళరావునగర్), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), సబితా కిషోర్ (వెంకటాపురం), గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్) డివిజన్లలో అన్ రిజర్వ్‌డ్ సీట్లలోనూ విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో వారి సంఖ్య 79కి చేరింది. తాజాగా పురుష కార్పొరేటర్ల కంటే మెజార్టీ మహిళలదే. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచిన మహిళా కార్పొరేటర్లు ఇండ్లకే పరిమితం అవుతున్నారు.

నూతనంగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి పతులు బస్తీల్లో పర్యటించడం, అధికారులతో చర్చలు, కొత్త పనుల ప్రారంభోత్సవం, డివిజన్లలో కొనసాగుతున్న పలు రకాల మరమ్మత్తు పనుల తనిఖీలు, నూతన పనుల కోసం ఆర్జీలు ఇలా ఒక్కటేమిటి అన్నింటిలోనూ వారే ముందుంటున్నారు డివిజన్‌కు సంబంధించి ఏ విషయంలోనూ స్వతంత్రంగా మహిళా కార్పొరేటర్లు వ్యవహరింగచడం లేదు. కొందరు తప్పనిసరైతే తప్పా ఇంటి గడప దాటకపోవడం గమనార్హం.

పెత్తనమంతా భర్తలదే..

గోషామహల్ నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో బీజేపీ మహిళా కార్పొరేటర్లు విజయం సాధించారు. డివిజన్లలో మాత్రం వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. తరచూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వేర్వేరు విభాగాల అధికారులతో మాట్లాడటం, అభివృద్ధి పనులు, పౌర సమస్యల పరిష్కారం ఇవే కాకుండా అన్ని విషయాలలో వారు జోక్యం చేసుకుంటున్నారు. చివరకు మీడియాకు రిలీజ్ చేసే ప్రెస్ నోట్లలో కూడా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తల ఫోటోలే ఉంటున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నా వారు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉన్నత విద్యావంతులే అధికం…

ప్రస్తుతం బల్దియాకు ఉన్న పాలకవర్గంలోని మహిళా కార్పొరేటర్లలో అధిక శాతం ఉన్నత విద్యావంతులే ఉన్నారు . వీరిలో కొందరు మహిళా కార్పొరేటర్లు తమదైన శైలిలో బస్తీలలో పర్యటిస్తే ప్రజలతో మమేకమౌతున్నారు. అధికారులు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. బస్తీలు, ఇతర ముఖ్య సమావేశాల్లో కూడా కొందరు కార్పొరేటర్లు ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సుమారు 20 మంది వరకు మహిళా కార్పొరేటర్లు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వారు ఉన్నారు. గతంతో పోలిస్తే ఇది శుభ సూచకమమే అయినప్పటికీ కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం భర్త చాటు భార్యలుగానే ఉంటున్నారు. భర్త రాసిచ్చే స్ర్కిప్టును సమావేశాలలో చదవడం వరకే మా విధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story