హరీశ్ రావు మాస్టర్ ప్లాన్ సక్సెస్.. ఈటలకు ఓటమి తప్పదా.!

by Anukaran |   ( Updated:2021-08-22 04:08:54.0  )
హరీశ్ రావు మాస్టర్ ప్లాన్ సక్సెస్.. ఈటలకు ఓటమి తప్పదా.!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినంత కాలం వెన్నంటి ఉన్న కేడర్ కమలం పంచన చేరగానే ఆయన్ను వదిలి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఆ మాజీ మంత్రి ముఖ్య అనుచరులు తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినప్పడు ఈటల రాజేందర్‌తో ఉన్న అనచరులంతా తిరిగి సొంత గూటికి చేరిపోయారు.

కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి మినహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్‌లు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరిన హుజురాబాద్ కేడర్ దాదాపుగా తిరిగి గులాబీ గూటికి చేరినట్టయింది.

బీజేపీ కేడరే దిక్కా..

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంతకాలం తన అనుచరులను నమ్మకుని ముందుకు సాగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇక బీజేపీ కేడర్ మాత్రమే బాసటగా నిలవాల్సిన పరిస్థితి తయారైంది. కాషాయ కండువా కప్పుకున్నప్పటి నుంచి ఒక్కొక్కరుగా ఈటలను వీడుతూ టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈటలతోనే కలిసి నడిచారు. కానీ, క్రమక్రమంగా వారంతా సొంత పార్టీవైపు అడుగులేశారు.

దీంతో, అతికొద్ది మంది నాయకులను మినహాయిస్తే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటల అనుచరులంతా దూరం అయ్యారు. ఇక నుంచి ఈటల వెంట బీజేపీ కేడర్ మాత్రమే కలిసి నడవనుంది. చాలా కాలంగా నియోజకవర్గంలో బీజేపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేక ఈటల చేరిక తరువాత గుర్తింపులేకున్నా అలాగే కొనసాగారు. కానీ, ఇప్పుడు ఈటలతో వచ్చిన కేడర్ అంతా బీజేపీకీ రాజీనామా చేయడంతో గతంలో ఉన్నావారే ఇప్పుడు ఈటల గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలిగిన వారెందరో..

ఈటల బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అప్పటికే సీనియర్లుగా ఉన్న తమను పట్టించుకోవడం లేదని కినుక వహించిన నాయకులు చాలా మంది తెరవెనకకే పరిమితం అయ్యారు. ఈటల వెంట వచ్చిన నాయకులతో పాటు ఈటల కూడా తన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా సొంత పనులకే పరిమితం అయ్యారు. తాజాగా మారిన పరిస్థితులతో గతం నుంచి బీజేపీలో కొనసాగుతున్న కేడర్‌తో ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితి ఈటలపై పడింది.

హరీశ్ ఆదేశం వల్లే చేరాం..

మంత్రి హరీశ్ రావు ఆదేశం వల్లే తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరామని కేడీసీసీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ పింగిళి రమేష్ ప్రకటించారు. ఆదివారం హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ పాటు పడుతోందన్నారు. ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యన్నతి కోసం పనిచేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed