జాబిల్లిపై ‘న్యూక్లియర్ రియాక్టర్’!

by Shyam |
జాబిల్లిపై ‘న్యూక్లియర్ రియాక్టర్’!
X

దిశ, ఫీచర్స్ : 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌక చంద్రుడిపై అడుగు పెట్టింది. ఆ తొలి అడుగు ఖగోళశాస్త్రంలోనే ఓ పెద్ద ముందడుగులా నిలిచిపోయింది. ఆ తర్వాత అపోలో17 ప్రాజెక్ట్‌‌లో భాగంగా జియాలజిస్ట్‌ హారిసన్ స్మిత్‌.. 1972 డిసెంబర్‌ నెలలో చంద్రుని ఉపరితలంపై నుంచి రాళ్లు, ధూళి భూమిపైకి తీసుకొచ్చాడు. అది జరిగి యాభై ఏళ్లు గడిచిపోతున్న మళ్లీ ఏ ఒక్క దేశం కూడా మానవుడిని అక్కడికి పంపలేదు.

ఈ నేపథ్యంలో మరోసారి అమెరికా పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో భాగంగా 2024 నాటికి చంద్రుని ఉపరితలంపైకి స్త్రీ, పురుషులని పంపించనుంది. అయితే జాబిల్లిపై ఎన్నో సంచలన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్న నాసా ‘న్యూక్లియర్ రియాక్టర్’ కూడా నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఇందుకుగానూ ఐడియాస్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది.

ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో.. నాసా చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించేందుకు వినూత్న సాంకేతికతను ఉపయోగించాలని యోచిస్తోంది. అంతేకాదు చంద్రునిపై ఆర్టెమిస్ బేస్ క్యాంప్‌ను నిర్మించేందుకు కూడా ప్రణాళికలు రచిస్తుంది. అదే విధంగా వైఫై నెట్‌వర్క్‌ రూపొందించే అంశంపై రీసెర్చ్‌ చేస్తున్నట్లు నాసా గ్లాన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్ ఇటీవలే వెల్లడించింది. ఇక తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ కో-ఆర్డినేషన్‌తో అమెరికన్ కంపెనీలను ‘ఫిషన్ సర్ఫేస్ పవర్ సిస్టమ్’ డిజైన్ కాన్సెప్ట్‌ల కోసం అడుగుతోంది నాసా. దశాబ్ద కాలంలో చంద్రునిపై ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించిన నాసా.. చంద్రుని ల్యాండర్ లేదా రోవర్ డెక్ నుంచి పని చేసేందుకు ఏజెన్సీకి కనీసం 40 కిలోవాట్ల శక్తిని అందించడానికి ఈ సిస్టమ్ అవసరమని పేర్కొంది.

అంతేకాదు ఫిషన్ సర్ఫేస్ పవర్‌ సిస్టమ్‌ను సోలార్ సెల్స్, బ్యాటరీస్, ఇంధన సెల్స్‌తో కలిపి రోవర్స్‌ను ఆపరేట్ చేయడానికి.. చంద్రుని వనరులను ఉపయోగించి నీరు, ప్రొపెల్లెంట్ సరఫరాలను ఉత్పత్తి చేయడానికి శక్తిని అందిస్తుందని నాసా వివరించింది. ఫిషన్‌ను శక్తి వనరుగా ఉపయోగించడం వెనుక విచ్ఛిత్తి అనేక కారణాలు ఉన్నాయని NASA పేర్కొంది. విచ్ఛిత్తి వ్యవస్థలు రిలయబిల్, శక్తివంతమైనవి, తేలికైనవి, నిరంతరం పని చేయగలవని పేర్కొంది. లోతైన అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు అణు విచ్ఛిత్తి అద్భుతమైన ఎంపికగా నిపుణులు భావిస్తున్నారు. సౌరశక్తితో పోలిస్తే.. అణు విచ్ఛిత్తికి ప్రయోజనాలు ఉన్నాయని, ఇది లూనార్ నైట్స్‌లో కూడా పని చేయగలదని అభిప్రాయపడ్డారు.

అణు విచ్ఛిత్తి అంటే ఏమిటి?

సరళంగా చెప్పాలంటే, అణు విచ్ఛిత్తి అనేది ఒక పెద్ద కేంద్రకం. భారీ మొత్తంలో శక్తిని విడుదల చేయడంతో రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియ. భారతదేశంలోని అణు రియాక్టర్లు అణు విచ్ఛిత్తి ప్రతిచర్యలను ఉపయోగిస్తాయి. అణు బాంబులను తయారు చేయడానికి కూడా ఈ ఫిషన్ రియాక్షన్ ఉపయోగిస్తారు.

Advertisement

Next Story