మారటోరియం పొడిగించాలి..

by Harish |   ( Updated:2020-08-27 03:20:31.0  )
మారటోరియం పొడిగించాలి..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(FHRI) ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లను మూడు నెలలపాటు అదనపు మారటోరియం (Maratoriom) వెసులుబాటు ఇవ్వాలని కోరింది. మారటోరియం పొడిగించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman), ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ (Shakthi kantha das)లను లేఖ ద్వారా అభ్యర్థించినట్టు ఎఫ్‌హెచ్ఆర్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. అనేక రాష్ట్రాల్లో అన్‌లాక్ దశ ఉన్నప్పటికీ హోటళ్లు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, బుకింగ్ విషయంలో ఎలాంటి పురోగతిని సాధించలేదని ఎఫ్‌హెచ్ఆర్ఐ లేఖలో పేర్కొంది. ‘ఆతిథ్య పరిశ్రమ కేవలం 10-20 శాతం సగటును మాత్రమే నమోదు చేసింది. నాలుగు నెలలకు పైగా హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు(Restaurents) మూసివేయబడ్డాయి. లాక్‌డౌన్ కాలంలో కనీసం ఆదాయం లేదు. పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినప్పటికీ వినియోగదారులు లేక నష్టాలను ఎదుర్కొన్నాము’ అని ఎఫ్‌హెచ్ఆర్ఐ వైస్ ప్రెసిడెంట్, హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా(HRAWI) అధ్యక్షుడు గుర్బాక్సిస్ సింగ్ కొహ్లీ చెప్పారు.

నెలవారీ వ్యయాలు, వసూళ్ల సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను అనుసరించి పరిశుభ్రత, భద్రతా చర్యలను పాటించేందుకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన వివరించారు. దీనివల్ల ఒత్తిడికి గురైన MSME రంగం కోసం ప్రకటించిన రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆతిథ్య రంగానికి సాయపడదని గుర్బాక్సిస్ సింగ్ తెలిపారు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగించడం వల్ల కొంత నిలదొక్కుకోగలమని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చాలామంది అసోసియేషన్ సభ్యులు దివాళా దశలో ఉన్నారు.

ఆతిథ్య రంగంలోని 90 శాతం మంది వ్యాపారులు రుణ పునర్నిర్మాణ అవకాశాన్ని పొందలేరు. దీనివల్ల ఆగష్టు తర్వాత నిరర్ధక ఆస్తులు(NPA) పెరుగుతాయని ఎఫ్‌హెచ్ఆర్ఐ, హెచ్ఆర్ఏడబ్ల్యూఐ సంయుక్త గౌరవ కార్యదర్శి ప్రదీప్ శెట్టి వెల్లడించారు. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక బ్యాంకులు రుణాలను చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న రుణగ్రహీతలపై బలవంతంగా చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుందని ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. ఆతిథ్య రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మారటోరియం పొడిగించాలని కోరారు.

Advertisement

Next Story