ICUలో రొమాన్స్.. జిల్లా ఆసుపత్రి పరువు తీస్తున్న సిబ్బంది.. డాక్టర్లేమో..

by Anukaran |   ( Updated:2021-08-29 08:33:24.0  )
ICUలో రొమాన్స్.. జిల్లా ఆసుపత్రి పరువు తీస్తున్న సిబ్బంది.. డాక్టర్లేమో..
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యులు పరోక్షంగా సెలవు దినాన్ని ప్రకటించుకున్నారు. ఎక్కువ రోగులు వచ్చే జిల్లా ఆస్పత్రి సైతం వైద్యులు లేని ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తోంది. దీంతో ఆదివారం రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క కరోనా, సీజనల్ వ్యాధులు సామాన్యులపై దండ యాత్ర చేస్తున్న క్రమంలో వాటిని నయం చేసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే ఆదివారం వైద్యులు వారికి అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా తప్పని పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఆర్ఎంపీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు మండిపడుతున్నారు. ఇంకా బీదవారైతే 108 సాయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వెళుతున్నారు.

కేవలం మూడు నెలల్లోనే సుమారు 500ల మందికి పైగా రోగులు 108 సాయంతో పాలమూరు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల నుండి ఉషారాణి అనే నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి చేరింది. అక్కడ ఉన్న సిబ్బంది పరీక్షించి ఆదివారం కాబట్టి వైద్యులు లేరని బయటికి గెంటేశారు. ఇది ఏంటని ప్రశ్నించిన వారిని ఎడాపెడా చివాట్లు పెట్టినట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లా ఏర్పాటై అన్ని హంగులతో జిల్లా ఆసుపత్రి పేదరోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు, గర్భిణీలు, ఇతర సాధారణ వైద్యం సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు.

ఈ నెల 11న లింగాల ప్రాంతానికి చెందిన గర్భిణీ రెండో కాన్పు కోసం వస్తే రెవర్ చేశారు. రెండు కిలోమీటర్ల ప్రయాణం చేసేలోపే సాధారణ ప్రసవం 108 వాహనంలోనే జరిగింది. కనీసం సాధారణ ప్రసవం కూడా చేయలేని ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రి అని చెప్పుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా జిల్లా ఆసుపత్రి..?

పేదలకు వైద్యం అందించే దేవాలయాన్ని కొంతమంది సెక్యూరిటీ గార్డులు, మహిళా వైద్య సిబ్బందితో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది జంటలు రాత్రి అయ్యిందంటే ఐసీయూ, ఇతర ప్రత్యేక వార్డులలో రొమాన్స్ చేస్తున్నారని ఆస్పత్రిలోని ప్రతి ఒక్కరూ చెవులు కొరుకుంటున్నారు. ఇట్టి విషయాలు వైద్యులకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రజా ప్రతినిధి పేరు చెప్పుకొని ఆస్పత్రిలో చలామణి అవుతున్నారని నేరుగా ఆస్పత్రి వార్డ్ లోనే అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపడం యావత్ జిల్లా ఆస్పత్రికి జిల్లాకు చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి వచ్చిందని లోలోపలే మదన పడుతున్నారు.

అస్తవ్యస్తంగా ఆసుపత్రి నిర్వహణ జిల్లా ఆస్పత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గర్భిణీ, బాలింతలు, అప్పుడే పుట్టిన పసిబిడ్డల వార్డులు, ఎక్సరే, స్కానింగ్, టీకా వార్డులు ఇలా వార్డులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. ఆయా వార్డుల ముందు ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది పైరవీలకె పరిమితం అవుతున్నారని ఎక్కడ చూసినా వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయని మండిపడుతున్నారు. వైద్యులు అంతా తమకు ఇష్టం వచ్చిన సమయంలోనే హాజరవుతూ బయటికి వెళ్ళిపోతున్నారు. కొన్ని మందులు, సెలెన్ బాటిళ్లు, సిరంజీలు, గ్లెజులు, శానిటైజర్ బాటిల్లు, ఇతర కాటన్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

రోగులకు కనీస మౌలిక వసతులు పారిశుద్ధ్యం ఇలా అన్ని విషయాల్లోనూ ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది వైద్యులు స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుని వైద్యం పేరుతో లూటీ చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే డ్యూటీకి సక్రమంగా రావడం లేదని రోగులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేద రోగులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed