- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్యర్యం.. ఖిలాషాపూర్ కోటలో జైనుల ఆనవాళ్లు
దిశ ప్రతినిధి, వరంగల్ : ఖిలాషాపూర్ కోటలో జైనుల కాలం నాటి ఆలయ శకలాలు, ఆనవాళ్లను చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి కనుగొన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఖిలాషాపురం కోటను సందర్శించిన ఆయన కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కట్టడాల్లో జైన ఆలయాలకు సంబంధించిన నిర్మాణాలున్నట్లు గుర్తించారు. గత సంవత్సరం చివరలో కురిసిన వర్షాలకు ఖిలాషాపూర్ సజ్జల గుమ్మి వైపు ఉన్న బురుజు కూలి పోయింది. రాతితో కట్టిన ఈ బురుజులో రాష్ట్ర కూటుల కాలం నాటి జైన దేవాలయంకు సంబంధించిన చారిత్రక ఆధారాలు బయటపడినట్లు ఆయన తెలిపారు. లోపల సుమం, పైన సింహం ముఖంతో ఉన్న రెండు కీర్తిముఖాలు ఉన్న రాతి స్తంభం, కలశం ఉన్న ద్వారం, ఏనుగు శిల్పం ఇతర ఆలయ శకలాలు బయట పడ్డాయి. ఇవి 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్ర కూటుల కాలానికి చెందిన జైన దేవాలయం చెందినవిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉట్టిపడుతున్న కళా నైపుణ్యం..
తాజాగా వెలుగులోకి వచ్చిన శిల్పాలలో ఆ నాటి కళా నైపుణ్యం ఉట్టిపడుతోంది. గోదుమ వర్ణంలో ఉన్న ఈ శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కలశం ఉన్న ద్వార స్థంభంపై నిలువుగా చిన్న చిన్న స్తంభాలున్నాయి. వీటి సంధుల్లో ఉలి పట్టడం కష్టమని, అలాంటి చోట్ల చతుర్దల పద్మాలను తొలచడం వారి నైపుణ్యతకు అద్దం పడుతోందని చెప్పారు. అనంతర కాలంలో పాలించిన కాకతీయుల కాలం నాటికి సూక్ష్మ శిల్ప కళ పరాకాష్టకు చేరిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జైన శాసనం
సజ్జల గుమ్మీ అని పిలిచే చోట జైన తీర్థంకరుడి శిల్పం ఉన్న శాసనమును, కోట బురుజుల గోడల్లో అనేక స్తంభాలను పరిశోధకుడు గతంలో గుర్తించారు. శాసనం పరిష్కరించి నట్లైతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కోట లోపల మోట చిమ్ములకు బూడిద రంగు ఇసుక రాతి స్థంబాలు ఉపయోగించారు. రహస్య ద్వారాలుగా చెబుతున్నా రెండిటిలో ఒక ద్వారానికి గర్భ గుడికి ఉపయోగించిన ద్వారం కాగా, మరో ద్వారానికి గుడికి ఉపయోగించిన ప్రధాన ద్వారం వలె ఉన్నాయి. ఇదిలా ఉండగా కోట ద్వారానికి కుడి వైపు మూలలో భూగర్భం నుంచి రాతితో కట్టిన సొరంగ మార్గం ఉంది. మూసుకుపోయిన ఈ మార్గం కోటలోపలి వైపునకు వెళుతుందో, లేక బంకర్‌గా ఉందో తెలుసుకోవాలన్నారు. బురుజు పునః నిర్మాణంలో వీటిని ఉపయోగించకుండా కోటలో ఒక పక్కన నిలబెట్టాలని పరిశోధకుడు పురావస్తు శాఖ వారికి విజ్ఞప్తి చేశారు.