‘హత్య కేసులో ఆ స్టేట్‌మెంట్‌ను ఎందుకు రికార్డు చేయలేదు’

by Sumithra |   ( Updated:2021-03-01 12:39:31.0  )
Telangana High Court
X

దిశ, క్రైమ్ బ్యూరో : న్యాయవాది దంపతుల హత్యపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణిలు ఇటీవల మంథనిలో పట్టపగలు హత్యకు గురైన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయగా సోమవారం విచారణ జరిగింది. న్యాయవాది దంపతుల హత్యకు సంబంధించి ఇప్పటి వరకూ జరిపిన దర్యాప్తును పోలీసులు నివేదిక రూపంలో కోర్టుకు అందజేశారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలు, నిందితుల కాల్ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు ఏజీ తెలిపారు.

ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. రెండు ఆర్టీసీ బస్సుల డ్రైవర్లను సాక్షులుగా గుర్తించామని అన్నారు. ప్రత్యక్ష సాక్షులకు ఎలాంటి రక్షణ కల్పించారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా.. సాక్షులకు అన్ని రకాల రక్షణ చర్యలు పోలీసులు తీసుకున్నట్టు ఏజీ వివరించారు. సీఆర్పీసీ 164 కింద ఇప్పటి వరకూ ఎంతమందిని ఇన్విస్టిగేషన్ చేశారని, మంథని కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఎంతమందిని హాజరు పర్చారని, కేసులో ఏ2, ఏ3 లను 164 స్టేట్మెంట్ ను ఇంకా ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

అంతే కాకుండా, బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ను ఎందుకు రికార్డు చేయలేదంది. వాళ్లను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు కానీ, మెజిస్ట్రేట్‌ను తీసుకొచ్చి గానీ స్టేట్మెంట్ రికార్డు చేయోచ్చు కదా అంటూ నిలదీసింది. వీటికి సమాధానంగా పోలీసులు సీఆర్పీసీ 164 స్టేట్మెంట్‌ను రికార్డు చేయలేదని, 161 కింద స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించినట్టు, త్వరలోనే వారి స్టేట్‌ మెంట్‌ను కూడా రికార్డు చేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. అందుకు మరో రెండు వారాలు సమయం కావాలని కోరగా, ఈ నెల 15వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed