శ్మశానాల్లో కాలుతున్న శవాలెన్ని?.. సర్కార్ లెక్కలపై హైకోర్టు సీరియస్

by Anukaran |
శ్మశానాల్లో కాలుతున్న శవాలెన్ని?.. సర్కార్ లెక్కలపై హైకోర్టు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్మశానాల్లో కాలుతున్న శవాలకు, బులెటిన్లలోని లెక్కలకు పొంతనే లేదని వ్యాఖ్యానించింది. గాంధీ ఆస్పత్రిలోంచి బైటకు వస్తున్న అంబులెన్సులు, వాటిలోని శవాల వివరాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ప్రశ్నించింది. ప్రతీ గంటకు ఎన్ని అంబులెన్సులు వస్తున్నాయో, పోతున్నాయో వాస్తవాలను తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తిగా లేవని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించింది.

కట్టడి చేయడానికి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, దీనితో కేసుల సంఖ్య బాగా తగ్గిందని అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన వివరణపై హైకోర్టు మండిపడింది. నిజంగా నైట్ కర్ఫ్యూతో కరోనా కేసులు తగ్గినట్లయితే ఎక్కడ తగ్గాయో చూపించాలని నిలదీసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దులో చేస్తున్న పరీక్షలు, తనిఖీలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెమిడెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్రంలోనే తయారవుతున్నా కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. పగటి వేళల్లో పబ్లిక్ ప్లేస్‌లు, బార్లు, పబ్‌లు, థియేటర్ల దగ్గర ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యలేంటని ప్రశ్నించింది. అధికారులు వైరస్ బారిన పడినా ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించింది.

కుంభమేళాకు వెళ్ళి తిరిగి వచ్చినవారిని ఇతర రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో పెడుతున్నా తెలంగాణలో అది ఎందుకు అమలుకావడం లేదని నిలదీసింది. తెలంగాణకు ఆ అవసరం లేదా అని వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల్లో బెడ్‌‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ గురించి డిస్‌ప్లే బోర్డులో ఎందుకు సక్రమంగా ఉండడంలేదని ప్రశ్నించింది. వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అడ్వొకేట్ జనరల్‌‌ను ప్రశ్నించింది. నైట్ షెల్టర్లు, ప్రత్యేక విడిది లాంటి ఏర్పాట్లు చేశారా అని ప్రశ్నించింది. హెల్ప్ లైన్ నెంబర్‌కు ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు అని ప్రశ్నించింది.

ఆర్టీపీసీఆర్, ఆక్సిజన్ విషయంలో కూడా ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలకు, వాస్తవాలకు తేడా ఉందన్నారు. ఆక్సిజన్ సరిపోయేలా ఉందని ప్రభుత్వం నివేదికలో పేర్కొన్నా కొరత ఎందుకు ఉందని నిలదీసింది. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల నివేదికలు 24 గంటలు దాటినా ఎందుకు రావడంలేదని ప్రశ్నించింది. సామాన్యులకు రిపోర్టులు రాకపోయినా వీఐపీలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించింది. వెబ్ పోర్టల్‌లో కరోనా కేర్ సెంటర్ల వివరాలు ఎందుకు లేవని ప్రశ్నించింది.

Advertisement

Next Story