- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధుపై విచారణ.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో అన్ని దళిత కుటుంబాలకు ‘దళితబంధు‘ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను రూపొందించిందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం జీవోలు విడుదల చేసిన 24 గంటల వ్యవధిలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ‘దళితబంధు‘ నిబంధనలను ఖరారు చేయకుండానే వాసాలమర్రి గ్రామంలో మొత్తం దళిత కుటుంబాలకు అమలుచేయడాన్ని ప్రశ్నిస్తూ ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్‘ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ బుధవారం విచారించి జీవోలను ప్రజలకు అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో ఉన్న ఇబ్బందులేంటని ప్రశ్నించింది.
కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ విడుదలైన 24 గంటల వ్యవధిలో ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. వాసాలమర్రి గ్రామంలో ‘దళితబంధు‘ అమలు విషయంలో ప్రభుత్వం నిర్దిష్టంగా ఆ పథకానికి ఎలాంటి నిబంధనలను ఖరారు చేయకుండానే రూ. 7.60 కోట్ల నిధులను విడుదల చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, వాసాలమర్రి గ్రామంలో మొత్తం దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఈ పథకానికి నిబంధనలను కూడా ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్‘ సంస్థ తరఫున న్యాయవాది శశికిరణ్ జోక్యం చేసుకుని ‘దళితబంధు‘ నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్‌సైట్‌లో లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలను తయారుచేసినట్లయితే అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, అర్హతకు అవసరమైన నిబంధనలు తెలియడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసినట్లయితే 24 గంటల్లోనే అది ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందేనని, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు బెంచ్ వాసాలమర్రి గ్రామానికి సంబంధించిన ‘దళితబంధు‘ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పటివరకు ప్రభుత్వం జారీ చేసిన అన్ని జీవోలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది.