మహా పాదయాత్ర ముగింపు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

by srinivas |
మహా పాదయాత్ర ముగింపు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 
X

దిశ, ఏపీ బ్యూరో : అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన తిరుపతి బహిరంగ సభపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. పాదయాత్ర ముగింపు సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్ధేశించిన సమయంలోనే సభ నిర్వహించుకోవాలని సూచించింది. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

ఇకపోతే ఈ నెల 17న తిరుపతిలో సభకు అనుమతి ఇవ్వాలంటూ అమరావతి జేఏసీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సభకు అనుమతిని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉండాలన్న డిమాండ్‌తో అమరావతి రైతులు, మహిళలు న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో మహా పాదయాత్రను చేపట్టారు. ఈ మహా పాదయాత్రను గత నెల 1న గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి చేపట్టారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగింది.

రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. సుమారు 500 కి.మీ ఈ పాదయాత్ర సాగింది. ఈ నెల 14 మంగళవారంతో అలిపిరి కాలినడక బాటన వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగిసినట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనెల 15న అమరావతి రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇకపోతే మహా పాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అమరావతి జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని కోర్టుకు జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు సభ అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Next Story