- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే
దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టంలోని నిబంధనలను స్పష్టం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోగలుగుతామని హైకోర్టు అభిప్రాయపడింది. భవనాల కూల్చివేత వ్యవహారం కేంద్ర చట్టం పరిధిలో ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆ చట్టం ఏం చెప్తుందో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సహాయ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. శుక్రవారానికి ఈ విషయాన్ని వివరిస్తానని కోరడంతో తదుపరి విచారణను డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను నిలిపివేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
సచివాలయ భవనాల కూల్చివేత పనులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం విచారించిన డివిజన్ బెంచ్ కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం కూల్చివేత పనులకు కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలియజేయాలని సహాయ సొలిసిటర్ జనరల్‌ను కోరింది. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం భవనాలను కూల్చివేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ రెగ్యులేటరి విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని అభిప్రాయపడింది. దీనిమీద కేంద్రం తెలియజేసే స్పష్టతకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం వీలవుతుందని వ్యాఖ్యానించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ, భవనాలను కూల్చివేస్తున్నదే కొత్త సచివాలయం నిర్మాణం కోసమని, ఆ సన్నాహక చర్యల్లో భాగంగా చేసే ప్రతీ పని చట్టం పరిధిలోకి వస్తుందని, అందుకే కూల్చివేతకు కూడా కేంద్ర రెగ్యులేటరీ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించారు. అలాంటి కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టం (2018)లోని నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు కూల్చివేత పనులను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి విధిగా లీగల్ రిజర్వ్‌మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందని నొక్కిచెప్పారు. ఇది కేవలం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, భవిష్యత్తులో కొత్తగా కట్టబోయేదానికి సంబంధం ఉన్న అంశమని వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, భవనాల కూల్చివేతకు రెగ్యులేటరీ విభాగం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని, కేవలం కొత్త నిర్మాణాలకు మాత్రమే అవసరమని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను డివిజన్ బెంచ్‌కు అందజేశారు. నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పకుండా అన్ని రకాల అనుమతులను తీసుకుంటామని తెలిపారు. కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థానిక పరిపాలనా సంస్థ అయిన జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల నుంచి అనుమతులు తీసుకున్నామని, అవి సరిపోతాయని వివరించారు.
ఇరు తరఫున వాదనలను విన్న డివిజన్ బెంచ్, కేంద్ర రెగ్యులేటరీ విభాగం నుంచి కూల్చివేత పనులకు అనుమతి అవసరమా లేదా అనే విషయంపై కేంద్రం ఇచ్చే స్పష్టతను బట్టి నిర్ణయం తీసుకుంటామని, తుది ప్రకటన చేయడానికి అదే కీలకమవుతుందని వ్యాఖ్యానించింది. శుక్రవారం ఉదయానికి సహాయ సొలిసిటర్ జనరల్ ఆ స్పష్టత ఇస్తారు కాబట్టి అప్పటివరకూ కూల్చివేత పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.