Telangana HighCourt : సర్వేపై ’స్టే’కు హైకోర్టు నిరాకరణ

by Shyam |   ( Updated:2021-05-27 12:04:25.0  )
Telangana HighCourt : సర్వేపై ’స్టే’కు హైకోర్టు నిరాకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జమున హాచరీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు సర్వే పనులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారుల బృందాలు భూముల సర్వే పనులు చేపట్టాయి. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జమున హేచరీస్ తరఫున ఈటల రాజేందర్ భార్య జమున(etela jamuna) హైకోర్టును ఆశ్రయించారు. సర్వే పనులకు స్టే విధించాలని హైకోర్టును ఆ పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జమునా హేచరీస్ సంస్థ తరపున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ, సరైన కారణం లేకుండానే ప్రభుత్వం సర్వే నోటీసులు జారీ చేసిందని, ఈ నోటీసుల ప్రకారం సర్వే జరగకుండా స్టే జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని, అసైన్డ్ భూముల కబ్జా జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున వాటి నిగ్గు తేల్చేందుకే ఈ నోటీసులను జారీ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్నందున సర్వే పనులను జరపడంలేదని, సద్దుమణిగిన తర్వాత జూన్ నెల రెండవ వారం లేదా మూడవ వారం నుంచి మొదలుపెడతామని హైకోర్టుకు వివరించారు.

ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జమునా హేచరీస్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసినట్లుగా సర్వే పనులపై స్టే విధించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వచ్చినందున వాటిలోని నిజానిజాలను తేల్చడానికి సర్వే చేస్తే తప్పేంటని ప్రశ్నించి, ఆ ప్రక్రియ ద్వారా ఆ భూములు ఎవరివో తేలిపోతుంది గదా అని వ్యాఖ్యానించింది. స్టే కోసం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story