రాష్ట్ర హోంశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం

by Shyam |
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ కోర్టుల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో రాష్ట్ర హోంశాఖ చేస్తున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిగణనలోకి తీసుకుని తక్షణం నియామకాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించి రెండున్నర నెలలు కావస్తున్నా ఇప్పటికీ అతీగతీ లేదని వ్యాఖ్యానించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ‘హోంశాఖ గాఢ నిద్రలో ఉన్నదా? న్యాయ వ్యవస్థ కూడా ఆ తరహాలోనే నిద్రపోవాలని భావిస్తున్నదా‘ అని ప్రశ్నించింది.

రాష్ట్రంలో 177 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ల నియమాక ప్రక్రియను చేపట్టినట్లు ఏప్రిల్ 1వ తేదీనే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలియజేశారని, రెండున్నర నెలలు గడిచిపోయినా నియమాక ప్రక్రియ ముగియలేదని, ఎవ్వరూ నియమితులు కాలేదని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ల నియామకంలో జరుగుతున్న జాప్యం కారణంగా క్రిమినల్ కేసుల విచారణకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని హైకోర్టు పేర్కొన్నది. ఈ నియామక ప్రక్రియను వీలైనంత తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని, లేదంటే కేసుకు తగిన ముగింపును హైకోర్టే ఇస్తుందని వ్యాఖ్యానించి తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story