ఏటూరునాగారం ఏజెన్సీలో హైఅల‌ర్ట్‌

by srinivas |   ( Updated:2021-10-26 01:20:49.0  )
Eturnagaram-12
X

దిశ, వెంకటాపురం: తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం బీజాపూర్ జిల్లాలోని చిట్లంతోగు గుట్టల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ సమయంలో 30 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కొత్తగూడెం, ములుగు, జయశంకర్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి నది దాటి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశమున్నందున గోదావరి పరివాహక ప్రాంతాలైన కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, కొత్తగూడెం జిల్లా చర్లలోని పలు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ సూచనలు, ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్ పర్యవేక్షణలో ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేసే 163 -జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలు, వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాల్లో ప్రయాణిస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే తప్పకుండా తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed