పిలిస్తే పలుకుతున్న ‘కోడి’.. దాణాగా చికెన్ పీసులు.. ఎక్కడంటే!

by Sridhar Babu |   ( Updated:2021-08-24 06:19:22.0  )
hen
X

దిశ, పాలేరు : కొన్నిసార్లు పక్షులు, జంతువులు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదు. అచ్చం మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయి. వాటి పిల్లలపై అవి చూపించే ప్రేమ.. మనతో ప్రవర్తించే తీరు చూస్తే ఒక్కోసారి కొత్తగా అనిపిస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలను మనం నెట్టింట తరచూ చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సందర్భాల్లో భయాన్ని కూడా కలిగిస్తాయి. తాజాగా ఓ కోడి తన యజమాని పిలువడమే ఆలస్యం.. ఎక్కడున్నా టక్కున పరిగెత్తుకుంటూ వస్తూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పాలేరు గ్రామంలోని ఓ కోడి తన యజమాని పిలువగానే ఎక్కడున్నా టక్కున పరిగెత్తూకుంటూ వస్తోంది. అది కూడా కోడిని కామన్‌గా పిలిచినట్లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే దానికో పేరుంది. ‘‘చోటూ.. ఖనా కాయింగే అవో.. జల్దీ జల్దీ అవో’’ అంటూ యజమాని పిలవగానే వచ్చేస్తోంది. దాణాకు బదులు చికెన్ ముక్క అందించగానే వచ్చి ఆరగిస్తుంది. ఈ అరుదైన ఘటనను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని తెలంగాణ చికెన్ సెంటర్లో చూడొచ్చు. పాలేరు గ్రామంలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తి కొన్నేళ్లుగా చికెన్ షాప్‌ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందట ఫారం నుంచి కోళ్లను కొనుగోలు చేశాడు. అందులో ఓ కోడి మాత్రం యాక్టివ్‌గా ఉండేది. ప్రతిరోజు లాగే వాటికి మేత వేసే సమయంలో యాజమాని ఫారంలోకి రాగానే అతని చుట్టూ తిరుగుతూ అల్లరి చేసేది. దీనితో నాగుల్ మీరా దానికి కనెక్ట్ అయ్యాడు.

దానికి ‘చోటూ’ అని పేరు కూడా పెట్టాడు. అది వచ్చిన దగ్గర నుంచి వ్యాపారం సహితం పెరిగిందన్నారు. ప్రతిఒక్కరూ వచ్చి ఆ కోడినే ఆడిగేవారన్నారు. నాగుల్ మీరా మాత్రం దాన్ని తప్పా.. మిగిలినవి అమ్మేవాడు. ప్రతీరోజు వ్యాపారం లాభసాటిగా మారడంతో చోటూకు మాత్రం దాణాకు బదులు ఆహారంగా ‘చికెన్ పీసులు’ అందించేవాడు. కోడి చేసే అల్లరితో చికెన్ కోసం వచ్చే కస్టమర్లే కాకుండా కోడిని చూసేందుకు జనాలు బాగా వస్తుండడంతో వ్యాపారం బాగా సాగుతున్నట్టు యజమాని చెప్పాడు. కొందరైతే ఎక్కువ డబ్బులు ఇస్తాం ఆ కోడిని ఇమ్మని ఆఫర్స్ పెట్టినా దాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏదిఏమైనా చోటూతో స్నేహం అతనికి లాభాన్ని చేకూరుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed