పోడు భూముల సమస్య పరిష్కారం కోసం హెలికాప్టర్ టూర్

by Shyam |
Arial-Survey142
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల సమస్యకు పరిష్కారం కనుగొనడంపై సర్కారు దృష్టి పెట్టింది. దసరా తర్వాత ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికంటే ముందు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవాలు సేకరించనున్నారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అటవీ ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా సందర్శించి పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీన ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పోడు భూముల సమస్య ఉన్న జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి భవిష్యత్తులో అడవులు తరిగిపోకుండా ఉండేలా సమగ్ర కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో ఈ సమీక్షా సమావేశం జరగనున్నదని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది.

ప్రగతి భవన్‌లో ఒక రోజు మొత్తం పోడు భూముల సమస్యకు పరిష్కారం కనుగొనడంపై సమీక్ష జరుగుతుందని, సుదీర్ఘంగా చర్చస్తామని పేర్కొన్నది. హరితహారం ఫలితాలను అంచనా వేస్తూనే మరింత విస్తృతంగా ఫలితాలను రాబట్టడానికి చేపట్టాల్సిన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్‌పై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారం అనేవి ఈ సమావేశంలోని ప్రధాన చర్చనీయాంశలని స్పష్టం చేసింది. ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిష్కరిస్తుందని పేర్కొన్నది. ఈ సమావేశానికి అటవీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ కన్జర్వేటర్లు, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు కూడా హాజరుకానున్నారు.

పోడు భూముల సమస్యకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ కార్యదర్శి, ప్రిన్సిపల్ చీఫ్ పారెస్టు కన్జర్వేటర్, పలువురు అధికారులు ఈ నెల 20, 21, 22 తేదీల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించి వివరాలను సేకరిస్తారు. అవసరమైతే స్థానిక అధికారులతో సమావేశాలను నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed