- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్ఈడీ.. అక్రమాలు ఆపేదెవరు?
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటులో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి మొత్తం రూ.3.31 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ నిధుల వినియోగంలో భారీగా గోల్‌మాల్ జరిగినట్టు తెలుస్తోంది. డివిజన్ పంచాయతీరాజ్ విభాగంలోని ఓ ఇంజనీరింగ్ విభాగం ముఖ్య అధికారి కనుసన్నల్లో అవినీతి జరిగినట్టు సమాచారం. దీనిపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
దిశ, నల్లగొండ: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సంకల్పించింది. ఇందుకోసం జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి మొత్తం రూ.3.31 కోట్లు విడుదల చేసింది. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కేటాయించింది. అయితే ఆ నిధులపై పంచాయతీరాజ్ శాఖ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కన్ను పడింది. సదరు అధికారి తనకు అనుకూలంగా ఉన్న ఓ కాంట్రాక్టర్‌ని రంగంలోకి దించి నిధులను స్వాహా చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
సర్పంచ్‌లపై ఒత్తిడి..
మినరల్ నిధుల నుంచి చేపట్టే పనులకు సాధారణంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ తీర్మానం ద్వారా ఫైనల్ చేస్తారు. పాలకవర్గం వర్క్ కాంట్రాక్టును ఎవరికి కేటాయిస్తే వారే పనులు చేపట్టాలి. కానీ ఇక్కడ అంతా పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. సదరు పంచాయతీరాజ్ శాఖ అధికారి తాను సూచించిన కాంట్రాక్టర్‌కే లైట్ల బిగింపు పనులను ఇవ్వాలని సర్పంచ్‌లకు హుకుం జారీ చేశారు. కాదన్న సర్పంచ్‌లపై కన్నెర్ర జేస్తున్నారు. అయితే ఆ అధికారికి ఎదురు చెప్పలేని సర్పంచ్‌లు ఆ కాంట్రాక్టర్‌కే పనులు అప్పగిస్తూ తీర్మానాలు చేసేశారు. పెండింగ్ బిల్లుల కోసం పంచాయతీ రాజ్ అధికారిని సంప్రదించినపుడు లిటిగేషన్ లింక్ పెడుతున్నాడని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.1400 లైటు రూ.3వేలకు..
నిబంధనల ప్రకారం కొన్నేళ్లపాటు గ్యారంటీ కల్పించే ఎల్‌ఈడీ లైట్లను వియోగించాల్సి ఉంది. బ్రాండెడ్ కంపెనీలు ఉన్నప్పటీకీ.. నాసిరకం లైట్లను నేరుగా పంచాయతీ కార్యాలయాలకు పంపించేసరికి సర్పంచ్‌లు నిర్ఘాంతపోయారు. బహిరంగ మార్కెట్లో రూ.1400 ఉన్న లైట్లను ఎస్టిమేట్‌లో రూ.3 వేలుగా చూపించారు. ఈ వ్యవహారంలో సదరు ఇంజినీరింగ్ విభాగ అధికారికి సుమారు రూ.50 లక్షల వరకు కాంట్రాక్టర్ ముట్టచెప్పినట్లు సమాచారం. చింతలపాలెం మండలంలో మంచి కండిషన్‌లో ఉన్న లైట్లను తొలగించి నాసిరకం లైట్లు బిగించి బిల్లులు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
మరి నాకేంటి..?
డివిజన్‌లో ఆ పంచాయతీ రాజ్ శాఖ అధికారి పేరు చెబితేనే సర్పంచ్‌లు వణుకుతున్నారు. ఏ అభివృద్ధి పని చేసినా.. అందులో ఆయనకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. ఏ బిల్లు కోసం వెళ్లినా ఆ అధికారి నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘మరి నాకేంటి’ అనేదే. సర్పంచ్‌లైనా.. కాంట్రాక్టర్లైనా మొహమాటం లేకుండా మెటీరియల్ పనులకు 3 శాతం, మట్టి రోడ్డు పనులకు 10 శాతం చొప్పున ఆయనకు పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికార పార్టీకి చెందిన నాయకుడి దృష్టికి తీసుకెళితే.. కమీషన్లు చూసి తీసుకోండి సర్.. మరీ అంతగా పీడించి తీసుకుంటే బాగోదు అని సదరు అధికారికి సలహా ఇవ్వడం గమనార్హం.