- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారి మట్టి విగ్రహాలకు సైతం ఇబ్బందులే..?
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఆంక్షలు లేనప్పటికీ వైరస్ ప్రభావం పరోక్షంగా వినాయక విగ్రహాల తయారీ, ధరలపై చూపెడుతోంది . కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలో విగ్రహాల ఎత్తు, మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా వినాయక నవరాత్రోత్సవాలు, ప్రతిమల ఎత్తుపై అలాంటి ఇబ్బందులు ఏవీ లేనప్పటికీ విగ్రహాల తయారీకి సమయం లేకుండా పోయింది. గతంలో వినాయక నవరాత్రులు పూర్తి కాగానే రెండు నెలల వ్యవధిలో తిరిగి ప్రతిమల తయారీ నిర్వహించేవారు . దీంతో తిరిగి వినాయక చవితి వరకు భక్తుల అవసరాల మేరకు విగ్రహాలు అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది ఇటీవల వరకు కోవిడ్ ఆంక్షలు అమలులో ఉండడం కారణంగా విగ్రహాల తయారీ నిలిచి పోయింది.
పెరిగిన డిమాండ్.. తగ్గిన ఉత్త్పత్తి
వినాయక చవితి పండుగకు కేవలం పది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అయితే గత వారం వరకు వినాయక నవరాత్రోత్సవాలపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూశారు. విగ్రహాల ఎత్తు, మండపాల ఏర్పాటు , నిమజ్జనం, పూజల విషయంలో ఆంక్షలు ఎత్తి వేయడంతో వినాయక విగ్రహాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. మండపాలలో విగ్రహాల ఏర్పాటుకుగాను తయారీదారుల వద్దకు మండప నిర్వాహకులు పరుగులు పెడుతుండగా విగ్రహాల కొరత ఉండడంతో వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
గతంలో ప్రతి యేటా వినాయక చవితి పూర్తయిన రెండు, మూడు నెలల వ్యవధిలో తిరిగి తయారీ మొదలు పెట్టేవారు. ఇలా సుమారు తొమ్మిది నుండి పది నెలల పాటు కళాకారులు విగ్రహాలను తయారీ చేసేవారు. అంతేకాకుండా బస్తీలలో ప్రతిమలు ఏర్పాటు చేసే మండప నిర్వాహకులు కూడా కనీసం రెండు నెలల ముందు వారికి ఎంత ఎత్తులో విగ్రహం కావాలి, విగ్రహం ఆకృతి తదితర అంశాలను వివరించి అడ్వాన్స్ చెల్లించేవారు .దీంతో వినాయక చవితి వరకు విగ్రహం తయారీ పూర్తయ్యేది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం మండపాలకు ఆలస్యంగా అనుమతినివ్వడంతో విగ్రహాల తయారీకి సమయం లేకుండా పోయింది.
పెరిగిన ధరలు..
గ్రేటర్ హైదరాబాద్ లో ధూల్‌పేట్ వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ సంవత్సరం మొత్తం విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇక్కడ విగ్రహాలు తయారు చేసే వారు కోట్లాది రూపాయలు వాటిపై పెట్టుబడి పెడతారు. గత సంవత్సరం కూడా ఇలాగే పెట్టుబడులు పెట్టిన అనంతరం ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కోట్లలో నష్టపోయారు. అప్పటికే తయారీ చేసిన విగ్రహాలు కొనేవారు లేక, అడ్వాన్స్‌లు చెల్లించిన వారు కూడా తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చివేయాలని గొడవలకు దిగడం వంటివి చోటు చేసుకున్నాయి.
అంతేకాకుండా విగ్రహాల తయారీకి ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకువచ్చేవారు . సుమారు ఏడాది కాలంగా వారికి చేతిలో పని లేకపోవడంతో కూలీలు సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయారు. దీని ప్రభావం విగ్రహాల తయారీపై పడింది. ఇప్పటి వరకు తయారైన విగ్రహాలు అందరి అవసరాల మేరకు లేకపోవడంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అందుబాటులో ఉన్న విగ్రహాలకు కూడా గతంతో పోలిస్తే ధరలు రెట్టింపయ్యాయని మండప నిర్వాహకులు వాపోతున్నారు.
చెరువు మట్టి కూడా కరువే..
నాలుగైదేండ్ల క్రితం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలనే నవరాత్రులు సందర్భంగా పూజించేవారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ హితకారుల విసృత ప్రచారం వల్ల అందరూ మట్టి గణపతి వైపు మొగ్గుచూపారు. దాదాపు ఈ విషయంలో అందరికీ చైతన్యం వచ్చింది. ఇదే సమయంలో కోవిడ్ ఆంక్షలు అమలులోకి రావడం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు, చెరువులలోని బంకమన్నుతో చేసిన విగ్రహాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి.
విగ్రహాల తయారీ కోసం నాణ్యమైన బంకమట్టిని చెరువుల నుంచి ముందుగానే సేకరించి పెట్టుకోవడం, ఇంకా ఇతర ముడి సరకును సిద్ధం చేసుకుని ఆరేడు నెలల ముందు నుంచే విగ్రహాలను సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే రకరకాల సైజుల్లో, ఆకారాల్లో వేల సంఖ్యలో పెద్ద, చిన్న విగ్రహాలను తయారు చేసుకుని పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు కురుస్తుండడం బంకమన్ను సేకరణకు ఆటంకంగా మారింది. దీంతో మట్టి విగ్రహాలు కూడా ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండే పరిస్థితులు లేవు. దీంతో ఈ యేడాది వినాయక విగ్రహాల ధరలు ఆకాశాన్నంటే పరిస్థితులు కనబడుతున్నాయి.