అంబేద్కర్ సాక్షిగా పేదవారికి అండగా ఉంటా.. ఎమ్మెల్యే

by Sumithra |   ( Updated:2024-12-19 06:24:23.0  )
అంబేద్కర్ సాక్షిగా పేదవారికి అండగా ఉంటా.. ఎమ్మెల్యే
X

దిశ, చిట్యాల : అంబేద్కర్ సాక్షిగా పేద పిల్లలకు, ప్రజలకు అండగా ఉంటానని, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని చల్లగరిగ గ్రామంలో బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు విచ్చేశారు. కాగా విగ్రహ కమిటీ మెంబర్లు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు డప్పులు, కోలాటాలతో బంతిపూలు చల్లుతూ ఘన స్వాగతం పలికి భారీ గజమాల వేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక పై ప్రొఫెసర్ కంచ ఐలయ్య, పసునూరి రవీందర్, శరత్, కొల్లూరి భరత్, రాజు నాయక్, సందీప్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైనారు.

దూడపాక నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ సాక్షిగా పేదవారికి అండగా ఉంటానని, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని తనకు వచ్చిన 10 కోట్లలో 8 కోట్ల 70 లక్షలు ఇక్కడ ఉన్న హాస్టల్ విద్యార్థుల వసతుల కోసం కేటాయించామని అన్నారు. నా సొంత ఖర్చులతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు, బెడ్ షీట్, బ్యాంకు లెట్, వేడినీళ్ల సౌకర్యాన్ని 11,900 మందికి ఈ వారంలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పేద ప్రజలు ఎన్నికల్లో చందాలు వేసుకొని, నన్ను ముందుకు నడిపించినప్పుడు కన్నీరు తీసుకోవాల్సి వచ్చింది. పేదోడి కష్టమే నా వృత్తి అని, ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని, నేను చచ్చేంత వరకు ఇదే నా వృత్తి, వ్యాపారం అని తెలిపాడు. భూపాలపల్లి నడిబొడ్డున గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని, దానికి కంచ ఐలయ్య రావాలని ఈ సందర్భంగా తెలిపాడు. నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నేనే నిర్మించి, అతిధుల సమక్షంలో ప్రారంభిస్తామన్నారు.

అంబేద్కర్ మందిరాలు కట్టాలి.. ప్రొఫెసర్ కంచ ఐలయ్య

అంబేద్కర్ ఈ దేశ చరిత్రను మార్చాలని చూసిండు, అంబేద్కర్ లేకుంటే ఈ దేశం బతికేది కాదు. నేను బీసీ అని చెప్పుకునే మోది ఈ దేశాన్ని పరిపాలించేవాడు కాదన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ గుడి కట్టాలని ఢిల్లీలో డిమాండ్ చేశానన్నారు.

జ్ఞాన మందిరాలు ఏర్పాటు చేయండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విగ్రహాన్ని పెట్టినంతమాత్రాన పండుగ కాదు. దండలు వేయడం, జై భీమ్ చెప్పడం కాదు. ఆ విగ్రహం ఏ విలువల కోసం బ్రతికిందో, ఆ విలువలను ప్రతిబింబించే విధంగా ఉండాలని, మన జీవనవిధానాన్ని మనమే మార్చుకోవాలి. సంపద ఎక్కడుందో మనం చూడాలి. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఆ జ్ఞానం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలన్నారు. కోట్ల అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. పేదరికం కూడా అంతే ఉంది. విజ్ఞాన మందిరాలు ఏర్పాటు చేసి పిల్లలను మహిళలను చదివించాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని వివిధ అంబేద్కర్ వాదులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed