హెల్త్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులకు షాక్..!

by Shyam |
health-director
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పరిస్థితులను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖలోకి గతేడాది వచ్చిన అన్ని డిప్యూటేషన్ పోస్టింగులను డైరెక్టర్ రద్దు చేశారు. దీంతో సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులు మళ్ళీ వారి పేరెంట్ డిపార్టుమెంట్లకు వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఈ మేరకు డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం డిప్యూటేషన్ పోస్టుల్లో ఉన్నవారందరినీ వెనక్కి పంపించాలని ఆదేశించారు. వారికి ఇచ్చిన వర్క్ ఆర్డర్లన్నింటినీ రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు చూసే మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు.

వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్యా విభాగం తదితర వేర్వేరు డిపార్టుమెంట్ల నుంచి ప్రజారోగ్యశాఖకు డిప్యూటేషన్ మీద వచ్చి విధులు నిర్వర్తిస్తున్న వారంతా తిరిగి పేరెంట్ డిపార్ట్‌మెంట్లకు తక్షణం వెళ్లిపోయేలా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతేడాది కరోనా టైమ్‌లో ఆరు నెలల కాలానికి డిప్యూటేషన్లు చోటుచేసుకున్నా దాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు ఉద్యోగులు డైరెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టడం మొదలైంది. కానీ, ఆ డిప్యూటేషన్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడడంతో ఊహించని షాక్ తగిలినట్లయింది.

మరికొద్ది మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి పనిచేస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లలో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. గతేడాది వైద్య మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు సుమారు 900 మంది వివిధ కారణాలతో డిప్యూటేషన్ మీద ప్రజారోగ్య శాఖలోకి వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు వారంతా వెనక్కి వెళ్లక తప్పడంలేదు. ప్రజారోగ్యశాఖలో కొన్ని పోస్టుల్ని రెగ్యులరైజ్ చేయడం, పదోన్నతులు కల్పించడం లాంటి ప్రక్రియలను ప్రారంభించాలనుకుంటున్నందువల్లనే ఇప్పుడు డిప్యూటేషన్‌ మీద వచ్చినవారందరినీ వెనక్కి పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల వైద్యాధికారులు ఈ ఉత్తర్వులను అమలుచేయాలని, నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డాక్టర్ శ్రీనివాసరావు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Next Story