కరోనా అడ్డుకట్టకు చర్యలు ముమ్మరం

by sudharani |   ( Updated:2020-03-03 10:58:34.0  )
కరోనా అడ్డుకట్టకు చర్యలు ముమ్మరం
X

హైదరాబాద్: రాష్ట్రంలో తొలి కరోనా (కోవిడ్-19) కేసు నమోదవవ్వడంతో ప్రభుత్వం ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ వైరస్‌పై చేపట్టిన చర్యలను వివరిస్తూ.. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పటివరకు 18224 మంది ప్రయాణికులకు స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు. వీరిలో 445మంది ప్యాసింజర్లను పర్యవేక్షణలో ఉంచగా, వంద మందిని ఇప్పటికే విడుదల చేశారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు మరో 36మంది అనుమానితులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. అలాగే, 408 మందిని ఇంటి వద్ద నుంచే పర్యవేక్షిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా తిరిగిన 86మందిని గుర్తించి, వారిని పర్యవేక్షణలో ఉంచినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, మరో 36మంది నమూనాలను కరోనా టెస్టులకు పంపగా వారి నివేదికలు రావాల్సిఉందని తెలిపింది.
కరోనా సోకిన వ్యక్తులను ఉంచేందుకు అదనంగా మరో మూడు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఈ వ్యాధిని అడ్డుకోవడానికి రూ.100కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు తెలిపింది. ఈ వైరస్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు హోర్డింగ్‌ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీల వంటి చర్యలు తీసుకోనున్నారు. సలహాలు సూచనల కోసం హెల్ప్‌లైన్ నెంబర్-104ను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed