2 లక్షల గ్రామాలకు విస్తరించే ప్రణాళికలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by Harish |   ( Updated:2021-09-26 05:02:36.0  )
2 లక్షల గ్రామాలకు విస్తరించే ప్రణాళికలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రాబోయే రెండేళ్ల కాలంలో 2 లక్షల గ్రామాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. దీని ద్వారా భారత్‌లోని మూడో వంతు గ్రామాల పరిధిని అందుకోగలమని బ్యాంకు అభిప్రాయపడింది. ప్రస్తుతం బ్యాంకు లక్ష గ్రామాలను కవర్ చేస్తోంది. రానున్న 18-24 నెలల కాలంలో బ్యాంకు బ్రాంచ్ నెట్‌వర్క్, బిజినెస్ కరస్పాండెంట్, బిజినెస్ ఫెసిలిటేటర్, డిజిటల్ ఔట్‌రీచ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ విస్తరణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపింది. దీనికోసం మరో ఆరు నెలల్లో మొత్తం 2,500 మందిని నియమించుకుంటామని, చాలా గ్రామాలకు బ్యాంకు సేవలు అందించే ప్రయత్నం చేస్తామని బ్యాంకు పేర్కొంది. భారత గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ మార్కెట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు దీర్ఘకాలికవృద్ధి అవకాశాలను ఇస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని వీలైనన్ని గ్రామాలకు బ్యాంకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నామని’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా అన్నారు. ప్రస్తుతం బ్యాంకు 550కి పైగా జీల్లాల్లో ఎంఎస్ఎంఈ సేవలనందిస్తోంది. లక్షకు పైగా గ్రామాల్లో పంట రుణాలు మొదలుకొని, వాహన రుణాలు, బంగారు రుణాలందిస్తోంది. గత కొన్నాళ్లుగా మారుతున్న గ్రామీణ ఆర్థికవ్యవస్థ మార్పులను అందుకుంటున్నామని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో బాధ్యతాయుతమైన సంస్థగా బ్యాంకు సేవలను అందిస్తామని రాహుల్ వెల్లడించారు.

Advertisement

Next Story