హరీశ్ రావు వర్సెస్ ఈటల.. కారణం కేసీఆర్..!

by Anukaran |   ( Updated:2021-06-05 20:44:32.0  )
హరీశ్ రావు వర్సెస్ ఈటల.. కారణం కేసీఆర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్‎లో ఈటల కుంపటి రాజుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్​.. ఇటీవల పదేపదే హరీశ్​రావును ప్రస్తావించడం, కేసీఆర్ వైఖరితో తాను హరీశ్​రావు చాలా ఇబ్బంది పడ్డామంటూ చేసిన ప్రకటనలతో చిచ్చు మొదలైంది. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై సైలెంట్‌గా ఉన్న మంత్రి హరీశ్​రావు.. ఎట్టకేలకు విమర్శలకు దిగారు. అందులో కూడా సుతిమెత్తగా విమర్శించారు. ఘాటు వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా ఈటలను హెచ్చిరిస్తున్నట్లే ప్రకటన చేశారు. ఈటలపై హరీశ్​ అస్త్రాన్ని గులాబీ బాస్​ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. కానీ హరీశ్​రావు తనకు మంచి దోస్త్​అంటూ ఈటల పదేపదే చెప్పడంపై అటు కేసీఆర్‌లో కూడా అసహనం తెప్పించిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించాలంటూ హరీశ్​రావును ఆదేశించినట్లు సమాచారం.

మరోవైపు ఈటల నియోజకవర్గం హుజురాబాద్‌లో మరోసారి హరీశ్​రావు జోక్యం చేసుకున్నారు. హుజురాబాద్​నేతలతో మళ్లీ సమావేశమయ్యారు. వచ్చే వారంలో మండలాల వారీగా నేతలను పిలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పలుమార్లు ఈటల రాజేందర్ తనపై కామెంట్స్​ చేసినా స్పందించకుండా ఉన్న హరీశ్​రావు.. టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాతే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శలకు దిగారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్, పార్టీలో ఉన్నప్పుడైతే ఈటలను పల్లెత్తు మాట కూడా అనలేదు.

నా భుజంపై తుపాకీ..!

ఈటల వ్యవహారంలో హరీశ్​రావు వ్యూహాత్మకమైన ప్రకటన చేశారు. తన భుజంపై తుపాకీ పెడుతున్నారంటూ వ్యాఖ్యానించడం చర్చగా మారింది. అంటే కేసీఆర్‌కు దూరం చేసేందుకే ఈటల మాట్లాడుతున్నారని, ఇది గుర్తించే కేసీఆర్.. హరీశ్​రావును దగ్గరకు తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో హరీశ్​రావు కూడా తనను ఇందులోకి లాగవద్దంటూ సున్నితంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అయింది. తన భుజంపై తుపాకి పెట్టడం వికార ప్రయత్నం అంటూ ఈటలకు సూచించారు.

ఇద్దరూ ఉద్యమ దోస్తులే

వాస్తవంగా తెలంగాణ ఉద్యమం నుంచి హరీశ్​రావు, ఈటల రాజేందర్ మధ్య స్నేహబంధం కొనసాగుతూ ఉంది. రెండోసారి మంత్రివర్గ కూర్పులో కూడా వీరిద్దరికీ స్థానం దక్కడం ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠగానే మారింది. ఇలాంటి పలు సందర్భాల్లో ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారనే ప్రచారం పార్టీలో ఎప్పటి నుంచే వినిపిస్తున్నదే. ఇటీవల ఈటల బర్తరఫ్ తర్వాత నుంచే హరీశ్​రావును పదేపదే వివాదంలోకి లాగేందుకు ఈటల రాజేందర్​ ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. హరీశ్​రావు, తాను పలుమార్లు చాలా మథన పడ్డామని, కండ్లలో నీళ్లు తెచ్చుకున్నామంటూ పాత సంగతులను గుర్తుకు తీసుకువచ్చారు. హరీశ్​రావు మాత్రం కొంత సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో హుజురాబాద్​నియోజకవర్గ నేతలతో ఒకసారి సమావేశమయ్యారు. ఈటల సొంత మండలమైన కమలాపూర్​నేతలతో సమావేశం కావడం, ఆ తర్వాత తన దోస్త్‌గా ఉండే హరీశ్​రావును తనపైనే ప్రయోగిస్తున్నారంటూ ఈటల వెల్లడించారు. తన దోస్తు తన నియోజకవర్గంలో ఎలా.. ఏం చేస్తాడో చూస్తానంటూ ఒక విధమైన ఇండికేషన్స్​ పంపించారు. అయినప్పటికీ హరీశ్​ స్పందించలేదు.

ఇక తప్పలేక…?

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్​స్పందించారు. అంతేకానీ మొన్నటి వరకూ పార్టీలో ఉన్న ఈటల… తమ దోస్తానాపై ఎంత చెప్పినా హరీశ్​రావు ఎక్కడా మాట్లాడలేదు. పార్టీలో ఉన్నాడనే కారణంతోనే ఆయనపై విమర్శలు చేయలేదని గులాబీ నేతలు చెప్పుతున్నారు. ఇప్పుడు హుజురాబాద్​అంశంలో టీఆర్‌ఎస్​కీలకంగా అడుగులు వేస్తుండటం, హరీశ్, ఈటల రాజేందర్ మంచి స్నేహితులు అనే ప్రచారం ఇంకా కొనసాగుతుండటంతో సీఎం కేసీఆర్ దీనిపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈటల వ్యాఖ్యలను ఖండించాలంటూ హరీశ్​కు ఆదేశాలిచ్చినట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే శనివారం హరీశ్​రావు ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందంటున్నారు. అంతేకాకుండా హుజురాబాద్‌కు చెందిన పలువురు నేతలతో హరీశ్​రావు శనివారం మరోసారి మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది పిలిపించుకుని మాట్లాడారని, మరికొంతమంది నేతలతో ఫోన్లలో మాట్లాడినట్లు చెప్పుతున్నారు. అయితే ఈ వారం రోజుల వ్యవధిలోనే హుజురాబాద్ సెగ్మెంట్​కు చెందిన కీలకమైన నేతలతో హరీశ్​రావు సమావేశమవుతున్నట్లు పార్టీ నేతల్లో టాక్​.

Advertisement

Next Story

Most Viewed