సీఎస్కే నుంచి తప్పుకున్న భజ్జీ

by Shyam |
సీఎస్కే నుంచి తప్పుకున్న భజ్జీ
X

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్‌ (csk)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ (ipl) 13వ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమవుతున్నట్టు భజ్జీ ప్రకటించారు. ప్రస్తుతం భజ్జీ ఇండియాలోనే ఉన్నాడు. అతను సీఎస్‌కే (csk) జట్టుతోపాటు యూఏఈ వెళ్లలేదు. ఐపీఎల్‌కు దూరమైన రెండో సీఎస్‌కే ఆటగాడు హర్భజన్.

ఇప్పటికే జట్టు నుంచి ఆల్‌ రౌండర్ (All-rounder) సురేష్ రైనా వైదొలిగిన విషయం విధితమే. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్‌కు హర్భజన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 40 ఏండ్ల ఈ వెటర్నర్ ప్లేయర్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం జలంధ్‌ర్‌లో కుటుంబంతోపాటు నివాసం ఉంటున్నారు. తనకు ప్రైవసీ కావాలని కోరాడు.

‘ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు సీఎస్‌కే యాజమాన్యానికి సమాచారం ఇచ్చాను. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యక్తిగత కారణాలతో ఆట నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాను. నాకు కొంచెం ఏకాంతం కావాలి అని భజ్జీ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 12 ఐపీఎల్ సీజన్లు జరగ్గా తొలి 10 సీజన్లలో ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

2018లో జరిగిన ఐపీఎల్ నుంచి సీఎస్‌కే తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు హర్భజన్ సింగ్. 160 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 150 వికెట్లు తీశాడు. యూఏఈలో సీఎస్‌కే బృందానికి గతవారం కరోనా పరీక్షలు నిర్వహించగా బౌలర్ దీపక్, మరో ఇద్దరు ఆటగాళ్లతోపాటు మొత్తం 13 మంది‌కి పాజిటివ్‌‌గా తేలిన విషయం విధితమే. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఆటగాళ్లు మినహా 11 మందికి నెగెటివ్ వచ్చింది. శుక్రవారం నుంచి సీఎస్‌కే ప్రాక్టీసును ప్రారంభించింది.

భజ్జీ తప్పుకున్నా ఫర్వాలేదు

వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ‌జట్టు నుంచి తప్పుకున్నా సీఎస్‌కే కు వచ్చే సమస్యేమీ లేదు. ఇప్పటికే ఆ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో పటిష్ఠంగా ఉంది. రెగ్యులర్ స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్, కరణ్ శర్మ ఉన్నారు. వీరితోపాటు ఈ ఏడాది పీయూష్ చావ్లా సైతం జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో భజ్జీ వైదొలగడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌కు నష్టమేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed