పెద్ద యుద్ధంలో గెలుపొందాం.. ఆటపాటలతో విజయోత్సవ ర్యాలిలో రైతులు

by Shamantha N |
farmers
X

న్యూఢిల్లీ: ఏడాది పాటు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతు నిరసనలు కేంద్రం హామీతో ముగిశాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో మకాం వేసిన రైతులు శనివారం నుంచి ఇంటిబాట పట్టారు. ఇది రైతులందరీ విజయమని వారు ప్రకటించారు. రైతు సంఘాల నేత బల్బీర్ సింగ్ రాజేవల్ కు శంభు సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. రైతులంతా ఆటపాటలతో ఇళ్లకు బయలుదేరారు. విజయోత్సవాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. ‘మేము గెలిచాం, కేంద్ర ప్రభుత్వం మా నిరసనలకు తలొగ్గింది. పంజాబీలకు, దేశ ప్రజలకు నా అభినందనలు. పెద్ద యుద్ధంలో గెలుపొందాం. దీనికి మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ విజయానికి కారణమైన 700 మందికి పైగా రైతు త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

15 వరకు సరిహద్దులు ఖాళీ..

ఈ నెల 15 వరకు సరిహద్దుల నుంచి పూర్తి స్థాయిలో ఖాళీ చేసి వెళ్తామని బికేయూ నేత రాకేష్ తికాయత్ అన్నారు. ‘ప్రభుత్వం తన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. ఇతర సమస్యలను పరిష్కరించడానికి అంగీకరించింది.

ఘాజీపూర్ లో చాలా భాగం ఆదివారం కల్లా ఖాళీ అవుతుంది. రైతులు అందరూ ఇంటికి వెళ్ళాక నేను బయలుదేరుతాను’ అని తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత రైతులు ఇంటికి మళ్లడంతో పంజాబ్, హర్యానా లోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనిలో పోలీసులు పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed