​డీసీసీబీలో చేతివాటం.. ఏదులాపురం సొసైటీ లో లక్షల రూపాయలు స్వాహా..?

by Sridhar Babu |   ( Updated:2021-12-22 06:57:56.0  )
​డీసీసీబీలో చేతివాటం.. ఏదులాపురం సొసైటీ లో లక్షల రూపాయలు స్వాహా..?
X

దిశ, ఖమ్మం రూరల్: కంచె చేను మేసిన చందంగా ఉంది రూరల్​ మండలం ఏదులాపురం సొసైటీ సిబ్బంది నిర్వాకం. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా వేలాది మంది సభ్యులు ఉన్న ఈ సంఘంలో ఓ ఇద్దరు సిబ్బంది.. బ్యాంకు​ అధికారి కలిసి ప్రజల సొమ్ము స్వాహా చేశారు. ఏదులాపురం సొసైటీ లో రైతులు చెల్లించిన నగదును బ్యాంక్​లో చెల్లించకుండా స్వాహా చేసిన ఘటన. సొసైటీ లో 2020, 2021 సంవత్సరానికి గాను రైతులకు ఇచ్చిన వివిధ రకాల రుణాలైనటువంటి టూవీలర్, గెదేలు, పంట రుణాలను వసూలు చేయడానికి సొసైటీ సిబ్బందితో పాటు బ్యాంకు​ అధికారులు కూడా తిరిగి వసూలు చేశారు.

వసూలు చేసిన డబ్బు లక్షల్లో ఉంటుంది.అయితే డబ్బులు చూసి కక్కుర్తి బుద్ధి పట్టిన ప్రభుధ్ధులు సరికొత్త పన్నాగం పన్నారు. సొంతంగా రశీదులు, చలాన్​లు చెల్లించినట్లు బ్యాంక్​ ముద్రలు తయారు చేసి చెల్లించిన బిల్లులను రైతులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సొసైటీ లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి ఇంతటి పని చేస్తాడా..? దీని వెనుక ఉన్నది ఎవరు అనేది అసలు ప్రశ్న. ఎప్పటి నుంచి ఈ దొంగ బిల్లుల వ్యవహారం నడుస్తోంది..ఎన్ని లక్షల స్వాహా అయ్యాయో అర్థం కాని అయోమయంలో సొసైటీ ఉంది.

నకిలీ బ్యాంకు​ స్టాంప్​, ముద్రలతో లక్షల రూపాయలు స్వాహా..

నకిలీ బ్యాంకు​ స్టాంప్​లు తయారు చేసి వాటిని బ్యాంకు​లో చెల్లించడం లేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా బ్యాంక్​ అధికారులు సదరు వ్యక్తి నుంచి కొంత రికవరీ చేసి చేతులు దులుపుకున్న ట్లు తెలిసింది. అతనిపై చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో కాలయాపన చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. దొంగలు దొరికినప్పుడు అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా విచారణ చేపట్టడం వెనుక ఇతర బ్యాంకు​ ఉద్యోగుల హస్తం కూడా ఉందని అనుమానం రేకెత్తిస్తుంది.

ప్రధాన సూత్రధారి రూరల్​ డీసీసీబీ బ్యాంక్​ మేనేజర్​..?

దొంగ ముద్రలతో డబ్బులు స్వాహా చేసిన వ్యవహారంలో గతంలో రూరల్​ డీసీసీబీ బ్యాంక్​లో పనిచేసే అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఆయన పనిచేసిన కాలంలో నిబందనలకు విరుద్ధంగా రూరల్​లో ఇద్దరు వ్యక్తుల ను పెట్టుకుని ఎటువంటి బ్యాంక్​ షూరీటిలు లేకుండా లక్షల రూపాయల నాబార్డు రుణాలను ఇచ్చినట్లు తెలిసింది. వీరిరువురు కూడా దొంగ ముద్రల తయారీలో కరుడుగట్టిన వ్యక్తులే కావడం గమనార్హం. రైతులు తాము కష్టపడి బ్యాంక్​లకు చెల్లించిన డబ్బులు బ్యాంకులో తమ ఖాతాలో జమ కావడం లేదని విషయం తెలిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరి డబ్బులు జమ అయ్యాయో..ఎవరికి కాలేదో..ఇంకెంతమంది రైతులు బలయ్యారు అనే విషయం తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed