హమాలీ కూలీల బతుకు భారం

by Shyam |   ( Updated:2020-03-28 07:50:27.0  )
హమాలీ కూలీల బతుకు భారం
X

దిశ,న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి హమాలీ కూలీల బతుకులను బజారు పాలు చేసింది. కరోనా నియంత్రణ చర్యలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో హమాలీ కూలీలకు పని లేకుండా పోయింది. పని చేస్తేగాని పూటగడువని దీనమైన స్థితి అసంఘటిత కార్మికులది.. పొట్ట కూటికోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి బతుకులకు భరోసా లేకుండా పోయింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని రంగాల సంస్థలు మూసివేయడంతో వివిధ మార్కెట్లలో పనిచేస్తున్న హమాలీ కూలీల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు ఇక్కడా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం కూడా అందే పరిస్థితిలేదు. తాము బతికేదెట్లా అని అందోళన చెందుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వివిధ జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అసంఘటిత కార్మికులు సుమారు 20 వేలకు పైమాటే. వీరి జీవనం ఏ పూటకు ఆ పూట అన్నట్లే ఉంటుంది. పని దొరికితేగానీ, ఆ రోజు పూట గడవని దీనమైన స్థితిలో వారి బతుకు జట్కాబండి నడుస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకూ విజృంభిస్తున్న కారణంగా నివారణ చర్యలో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంలో అన్నిసంస్థలు పూర్తిగా మూసివేశారు. దీంతో హమాలీ కూలీలకు పనిలేకుండా పోయింది. రెక్కడాతేగానీ డొక్కాడని కార్మికుల జీవనం దీనస్థితికి చేరుకుంది. పని దొరికిన రోజుల్లోనే కుటుంబ జీవనం కత్తిమీది సాముల గడుస్తుంది. ఇక ప్రస్తుత సమయంలో వారి జీవన స్థితిగతులు వర్ణణాతీతంగా మారాయి..

పని చెప్పేవారే లేరు..

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి, ఇక్కడి నుంచి బయటికి ఎగుమతులు నిలిచిపోవడంతో హమాలీ కార్మికులకు పనిలేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు దిగుమతులు చేసుకున్న రోజుల్లో రోజుకు కేవలం న్యూమల్క్‌పేట్ మార్కెట్లో సుమారు 2000 మంది పనిదొరికేది. లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర్లంలో ఎలాంటి దిగుమతులు చేసుకోకపోవడంతో రోజుకు రూ.1000 ఆదాయ సంపాధించే హమాలీ కూలీ రోజు రూ100 కూడా సంపాదించలేని దుస్థితి నెలకొంది. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారిందని హమాలీ కూలీలు వాపోతున్నారు. అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలు కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వలస వచ్చినవారు ఉన్నారు. వీరంత ఇక్కడా ఏండ్ల కొద్దిగా స్థిరపడ్డప్పటికీ వీరికి ఓటు హక్కుతప్ప రేషన్ కార్డులు లేకపోవడంతో వీరికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియం, రూ.1500 కూడా వచ్చే అవకాశం లేక పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు..

ప్రభుత్వం మా కుటుంబాలను ఆదుకోవాలి : భద్రం హమాలీ కూలీ, కర్ణాటక

నేను న్యూమల్క్‌పేట్ మార్కెట్ 20 ఏండ్ల నుంచి హమాలీ పని చేస్తున్న.ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. వారం రోజుల నుంచి పనిలేదు.పనిచేస్తే గాని పూటగడవని పరిస్థితి మాది ఏమీ తిని బతుకాలో అర్థం కావడం లేదు. పనిచేప్పే వారు లేరు బయటి నుంచి ట్రాన్స్‌పోర్టు రావడం లేదు. పొద్దునుంచి సాయంత్రం వరకూ మార్కెట్లో కూర్చున్న రూ.100 పనికూడా దొరకడం లేదు. ప్రభుత్వం మా బతుకులను అర్థం చేసుకొని మమ్ముల్ని ఆదుకోవాలి.

కుటుంబాన్ని సాకడం కష్టమైంది: అశోక్ హమాలీ కూలీ, కర్ణాటక

నా ఒక్కడి కష్టజీతం పై నాలుగురు ఆధారపడి ఉన్నారు. పని చేస్తే వచ్చే డబ్బులతోనే కుటుంబం గుడుస్తుంది. వారం రోజుల నుంచి పనులు లేకపోవడంతో కుటుంబం గడువడం కష్టంగా మారింది. పిల్లలకు పాలు కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నం. ఇంటి అద్దె చెల్లించ లేదు ఎప్పుడు ఇంటి నుంచి గెట్టివేస్తారో అర్థ కావాడం లేదు. ప్రభుత్వం మా అసంఘటీత కార్మికుల గురించి ఆలోచించి మాకు సహకారం అందించాలి.

Advertisement

Next Story