డేంజర్ బెల్స్ మోగిస్తున్న గురుకులాలు.. ఆస్పత్రిలో చేరిన 47 మంది బాలికలు..!

by Anukaran |   ( Updated:2021-12-03 09:51:40.0  )
డేంజర్ బెల్స్ మోగిస్తున్న గురుకులాలు.. ఆస్పత్రిలో చేరిన 47 మంది బాలికలు..!
X

దిశ, చొప్పదండి : చదువు చెప్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చాల్సిన రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థులకు డేంజర్ జోన్లుగా మారుతున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారులు అవినీతిలో మునిగి తేలుతుండంతో వారికి సరైన సౌకర్యాలు అందడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 47 మంది బాలికలు ఆస్పత్రి పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనంతటికీ నాసిరకం ఆహారమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం రోజున వెలుగుచూసింది.

ఈ రోజు మధ్యాహ్నం క్యాబేజీ కర్రీ, ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా ఇవ్వగా అవి సరిగ్గా ఉడకలేదు. భోజనం చేశాక విద్యార్థులకు సరిగా అరగకపోవడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి వారంతా అవస్థలు పడ్డారు. కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో నరకయాతన అనుభవించగా వారిని హుటాహుటిన కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా గురుకులాల ఆర్సీఓ అలివేలు పాఠశాలను పరిశీలించి విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి డీఎంహెచ్ఓ జుబేర్ ఇయా పాఠశాలను సందర్శించారు. వీరి వెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి, ఏసీటీ అరుణ కూడా ఉన్నారు. ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇటీవల చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆస్పత్రిల్లో చేరగా పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు కూడాఉన్నాయి.

Advertisement

Next Story