ఇంకెప్పుడిస్తారు మాకు వ్యాక్సిన్.. రోడ్డెక్కిన గల్ఫ్ కార్మికులు

by vinod kumar |
gulf-labours 1
X

దిశ, నిజామాబాద్ సిటీ : సర్కారు వ్యాక్సినేషన్ కేంద్రంలో తమకు టీకా వేయడం లేదని గల్ఫ్‌కు వెళ్లే కార్మికులు ఆందోళన బాట పట్టారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి మైగ్రంట్ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు టీకా వేయించుకునేందుకు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్మికులకు ఫస్ట్ డోస్ వేసేందుకు పర్మిషన్ లేదని నిర్వాహకులు చెప్పడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. తాము గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా టీకా వేసుకోవాలని నిబంధన ఉందని, ఎలాగైనా తమకు టీకావేయాలని ప్రాధేయపడినా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా ఏం లాభం లేదు. ప్రస్తుతం ఇక్కడి కేంద్రంలో రెండవ డోసు మాత్రమే వేస్తున్నామని వారికి నచ్చజెప్పినా వినిపించుకోలేదని అధికారుల చెబుతున్నారు.

దీంతో టీకా కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ జిల్లా జనరల్ ఆస్పత్రి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. బయట నుంచి వైద్య అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి నచ్చచెప్పినా శాంతించలేదు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం అధికారులు వెంటనే జోక్యం చేసుకొని రెండు రోజుల తర్వాత వాక్సినేషన్ వేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే గల్ఫ్ కంట్రీస్‌కు వేళ్లేవారికి త్వరగా టీకా ఇప్పించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్‌లకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు.

Advertisement

Next Story