రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు!

by Harish |
Four Years of GST
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తువు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్లను దాటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ. 1,04,963 కోట్లతో ఈ ఏడాది రెండో అత్యధిక వసూళ్లు నమోదైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు, ప్రభుత్వం ప్రకటించిన వివిధ చర్యలు, కొవిడ్-19 మహమ్మారి నుంచి వ్యాపారాలు నిలదొక్కుకోవడంతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అక్టోబర్ నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ, గతేడాది నవంబర్‌తో పోలిస్తే 1.4 శాతం పెరిగాయి. నవంబర్ మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ. 19,189 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ రూ. 25,540 కోట్లు, ఐజీఎస్టీ రూ. 51,992 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో దిగుమతుల ద్వారా రూ. 22,078 కోట్లు, సెస్ రూ. 8,242 కోట్లుగా వసూలు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం 12 నెలల కాలంలో మొత్తం ఎనిమిది సార్లు జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లను దాటగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్ వంటి సవాళ్ల మధ్య జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయి.

ఇటీవల అన్‌లాక్ తర్వాత వరుసగా రెండు నెలలు రూ. లక్ష కోట్ల వసూళ్లు దాటడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్ర్సరం ప్రారంభంలో ఏర్పిల్‌లో దారుణంగా రూ. 32,172 కోట్లకు పడిపోగా, తర్వాత నాలుగు నెలల వరకు వార్షిక ప్రాతిపదికన తక్కువగా నమోదయ్యాయి. ఆగష్టులో కొంత మెరుగయ్యాక, సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన వృద్ధిని సాధించాయి.

Advertisement

Next Story