శ్రీశైలం ఘటనపై ఆరోపణలు నిజమే..!

by Anukaran |   ( Updated:2020-08-23 23:06:38.0  )
శ్రీశైలం ఘటనపై ఆరోపణలు నిజమే..!
X

దిశ, న్యూస్‌బ్యూరో : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి 9 మంది ఉద్యోగులు మరణించి రోజులు గడుస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్‌జెన్‌కో) మీద ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే జల విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడ్డ ప్రభుత్వం ఈ సీజన్‌లో ఎంత వీలైతే అంత జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్లాంటు వాస్తవ (నేమ్ ప్లేట్ సామర్థ్యం కన్నా వాస్తవ సామర్థ్యం తక్కువగా ఉంటుంది) సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేయాలని ఒత్తిడి చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్లాంటు, జల విద్యుత్ ఉత్పత్తి గురించి తెలిసిన పలువురు ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ప్రమాదం జరిగిన గురువారం, అంతకు ముందు రెండు రోజులు వరుసగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు విద్యుత్ డిమాండ్ కూడా పెద్దగా లేదు. ప్రమాదం జరిగిన గురువారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 144 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం మాత్రమే నమోదైంది. ఆ రోజు గరిష్ఠ విద్యుత్ డిమాండ్ చాలా తక్కువగా 6821 మెగావాట్లు మాత్రమే రికార్డైంది. అయితే ఆ రోజు రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అతి ఎక్కువగా 28 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2000 మెగావాట్లుగా ఉంది. అంటే రోజుకు సుమారు 35 మిలియన్ యూనిట్లు గరిష్ఠంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. గురువారం జరిగిన ఉత్పత్తిని బట్టి చూస్తే కొద్దిగా తక్కువగా సుమారు రాష్ట్రంలో ఉన్న జలవిద్యుత్ సామర్థ్యాన్నంతా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇలా జల విద్యుత్ ఉత్పత్తిని గరిష్ఠంగా వినియోగించుకొని థర్మల్, బయటి నుంచి కొనే విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం కారణంగానే జల విద్యుత్ కేంద్రాల మీద ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం సంభవించిందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పొంతన లేని పవర్ డిమాండ్ గణాంకాలు

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంతగా లేనందునే శ్రీశైలం ప్లాంటు నుంచి విద్యుత్ ఉత్పత్తిని మొత్తం ఆపేశామని, గతంలో రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేదని పేర్కొంటూనే శ్రీశైలం ప్రమాదంపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ అవాస్తవమని ఖండిస్తూ జెన్‌కో సీఎండీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జెన్‌కో సీఎండీ మాటలకు.. ఆయనే సీఎండీగా ఉన్న ట్రాన్స్ కో వెల్లడిస్తున్న రాష్ట్ర విద్యుత్ వాడకం గణాంకాలకు పొంతన కుదరడం లేదు. ప్రమాదం జరిగిన గురువారం రాష్ట్ర వ్యాప్త డిమాండ్ 144 మిలియన్ యూనిట్లు ఉంటే జలవిద్యుత్ ఉత్పత్తి 28 మిలియన్ యూనిట్లుగా ఉందని సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన మూడో రోజైన శనివారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగి 157 మిలియన్ యూనిట్లుగా ఉంటే మొత్తం విద్యుత్‌లో జల విద్యుత్ ఉత్పత్తి కేవలం 17 యూనిట్లే నమోదైంది. దీనికి కారణం శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రమాదానికి గురై దాని నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ఆగిపోవడమేనని స్పష్టమవుతోంది. అంటే రాష్ట్రంలో 144 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్నపుడు 28 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడిందన్న విషయం తేటతెల్లమవుతోంది. అదే 157 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం ఉన్నప్పటికీ శనివారం కేవలం 17 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తితోనే సరిపెట్టుకోగలిగిందంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడానికే జల విద్యుత్ సామర్థ్యాన్ని కావాలనే అధిక ఒత్తిడికి గురిచేసినట్లు స్పష్టమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సీజన్‌లో బ్యాటరీ పనులు

రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి కేవలం వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు వచ్చే 3 నెలలలోనే అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు థర్మల్ విద్యుత్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ విద్యుత్ అందుబాటులో ఉన్నపుడు ఎంత వీలైతే అంత ఉత్పత్తి చేసి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సబ్సిడీ విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చనే ప్రభుత్వం ఆలోచనగా ఉండి ఉంటుందని పలువురు విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే విద్యుత్ వాడి సబ్సిడీ భారం తగ్గించుకోవాలనుకోవడం సరైనదే. అయితే జల విద్యుత్ కేంద్రాల మెయింటెనెన్స్, రిపేర్ పనులు, సర్వీసింగ్ లాంటి వాటిని ఉత్పత్తి ప్రక్రియ లేని అన్ సీజన్‌లో చేసుకోవాలి. కానీ గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న వర్షాల సీజన్‌లో కంట్రోల్ ప్యానెల్ బ్యాటరీల మార్పిడి లాంటి పనులు చేపట్టడం కారణంగానే ప్రమాదం జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందే మరమ్మతులు, రిపేర్ చేసుకొని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని, 9 మంది విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదని వారు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Next Story