క్షీణిస్తున్న భూగర్భజలాలు.. ఆందోళనలో రైతులు

by Anukaran |
క్షీణిస్తున్న భూగర్భజలాలు.. ఆందోళనలో రైతులు
X

దిశ, కరీంనగర్ సిటీ: పాతాళ గంగ రోజు రోజుకు పడిపోతుంది. జలాశయాల్లో నీళ్లున్నా, నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. వేసవికి ముందే ఎండల తీవ్రత పెరుగుతుండగా, శరవేగంగా భూగర్భజలాలు క్షీణిస్తున్నాయి. దీంతో, వానకాలానికన్నా అధికంగా సాగు చేసిన యాసంగి రైతుల్లో ఆందోళన తీవ్రం అవుతోంది. వరుసగా ఏండ్ల తరబడి నెలకొన్న కరువుతో, గతేడాది వరకు భూగర్భ జలాలు ఇంకుతూనే ఉన్నాయి. అయితే , ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో నీటి ప్రవాహం ఉప్పొంగింది. పంట పొలాల్లో అడుగేస్తే నీటి దారలు ఉబికి వచ్చాయి. దీంతో వానాకాలం పంటలన్నీ పైనీటికే పూర్తి కాగా, రైతుల్లో ఆనందం వెళ్లి విరిసింది. ఇదే ఉత్సాహంతో ఈ యాసంగిలో రైతులు ఖరీఫ్ కన్నా అధికంగా సాగు చేశారు.

1.5 లక్షల ఎకరాల్లో సాగు..

వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ యాసంగిలో 2,59,402.35 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో 2.33 లక్షల ఎకరాల వరకు వరి సాగు చేశారు. దీంతో ఒక్కసారిగా నీటి వినియోగం పెరిగింది. జిల్లాలో గతేడాది ఫిబ్రవరి లో 6.84 మీటర్ల లోతులో నీటి మట్టముండగా, ఈ ఏడాది ఇదే నెలలో 6.90 మీటర్ల పైకి ఉన్నట్లు, అధికారులు వెల్లడిస్తున్నారు. గతేడాదికన్న .006 మీటర్ల పైనే నీటిమట్టమున్నా, వర్షాకాలంతో పోల్చితే తక్కువేనని స్పష్టమవుతోంది. గత ఖరీఫ్‌లో వరుసగా పక్షం రోజులకు పైగా కురిసిన ముసురు వానలతో, భూమిలోని నీటి పొరలు అతుక్కుపోయి, జలాశయాల్లోని నీరు భూపొరల్లోకి చేరటం లేదని నీటి నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

ఫిబ్రవరిలోనూ నాట్లు..

సంక్రాంతి లోపే యాసంగి నాట్లు వేయటం ఆనవాయితీ కాగా, ఈసారి మాత్రం ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు పొట్టదశలో ఉండాల్సిన వరి, ఇంకా కలుపు దశలోనే ఉన్నాయి. ఇదే తరుణంలో నీటి ఎద్దడి మొదలవ్వటంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో రెండు నెలలపాటు నీటి అవసరం తప్పనిసరి కాగా, తగ్గుతున్న నీటిమట్టంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. దిగువ మానేరు జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో, ఆయకట్టు భూముల పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా, నాన్ కమాండ్ ప్రాంత పొలాల పరిస్థితిపై రైతులు అయోమయానికి గురవుతున్నారని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story