స్టీల్ దిగుమతులపై సుంకం గడువు పెంపు!

by Harish |   ( Updated:2020-06-04 08:10:58.0  )
స్టీల్ దిగుమతులపై సుంకం గడువు పెంపు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: చైనా, కొరియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును ఈ ఏడాది డిసెంబర్ 4 వరకూ పొడిగిస్తున్నట్టు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. పై దేశాల నుంచి తక్కువ ధరకు ఇండియాలో దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులను నియంత్రించడానికి 2015 జూన్ 5న కేంద్ర మంత్రిత్వ శాఖ యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. దీనికి ఐదేళ్ల కాలపరిమితి విధించింది. ఈ గడువు రేపటి(జూన్ 5)తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ 4 వరకు పొడిగించారు. వాణిజ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ చైనా, కొరియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని ఆరు నెలల వరకూ పెంచాలని కోరడంతో..ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీల్ 304 సిరీస్‌కు ఈ సుంకం వర్తిస్తుంది. ఈ స్టీల్‌పై ఒక టన్నుకు 316 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ సుంకం విధిస్తారు. ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకే ఉత్పత్తులు మనదేశంలోకి వస్తుండటంతో దేశీయ పరిశ్రమలు దెబ్బ తింటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నిబంధనలను అనుసరించి దిగుమతులకు కొంతవరకు నియంత్రించడానికి యాంటీ డంపింగ్ సుంకాన్ని అమలు పరుస్తున్నారు.

Advertisement

Next Story