PRC హామీకి 1000 రోజులు.. అమలెప్పుడో!

by Anukaran |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ఉద్యోగుల పనితీరును బట్టే ప్రభుత్వానికి పేరు వస్తుంది. భూ సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది బాగా కష్టపడ్డారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్ సీఎంలు మన పనితీరును మెచ్చుకున్నారు. టీచర్లు మంచి ఫలితాలు సాధించారు. ఇప్పటి వరకు అన్నీ పనికి మాలిన కమిషన్లు. ఇప్పుడు మూడు నెలలలో రిపోర్టు వచ్చేలా త్రీమెన్ కమిటీ వేద్దాం. 2018 జూన్ రెండున ఐఆర్ ప్రకటించుకుందాం. 2018 ఆగస్టు 15 నుంచి పీఆర్సీ అమలు చేసుకుందాం’’ 2018 మే 18న సీఎం కేసీఆర్ ఉద్యోగసంఘాలతో అన్న మాటలివి. సీపీఎస్ రద్దు మీద కేబినెట్​ సబ్​ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యూటీ, బదిలీలు, టీచర్ల సర్వీస్ రూల్స్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల (రూ.398) మంజూరు, పండిట్, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్, వేసవి సెలవులలో మధ్నాహ్న భోజనం విధులలో పాల్గొన్నవారికి ఈఎల్స్ మంజూరు, పెన్షనర్లకు 70 ఏండ్ల క్వాంటమ్ ఆఫ్​ పెన్షన్, 1969,2000 ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు తెలంగాణ ఇన్సెంటివ్ మంజూరుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాలన్నింటినీ ప్రకటించారు.

ఏం జరిగింది మరి!

ఐఏఎస్​ అధికారులు బిస్వాల్​, రఫత్​ అలీ, ఉమామహేశ్వర్​రావు అధ్వర్యంలో 2018, జూన్​ 28న త్రీమెన్​ కమిటీ నియమించారు. ఉద్యోగ సంఘాలు పాలాభిషేకాలు చేశాయి. అప్పటి నుంచి పీఆర్సీ వస్తుందనే ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. వెయ్యి రోజులు గడిచాయి. అతీగతీ లేదు. వేతన సవరణ అంశం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే తేలుతుందనే ప్రచారం జరుగుతోంది. క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత బయటకు వచ్చింది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్​ మెరుగైన ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని ఆశించారు. గత నెలలోనే ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ, ఎటూ తేలడం లేదు. గ్రాడ్యుయేట్​ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే​ వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లకంగా మారింది. ఫిట్​మెంట్​ తేల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్లను ముట్టడించాయి. ఈ వారంలో ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని ఆశతో ఉన్నారు.

ఫాయిదా ఉంటుందా?

వేతన సవరణ 32 నెలలుగా సాగుతూనే ఉంది. తొలి విడత ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చిన ఉద్యోగులు రెండో విడతలో మాత్రం వ్యతిరేకతతో ఉంటున్నారు. పీఆర్సీ రాలేదు. ఐఆర్​ ప్రకటించలేదు, డీఏ ఇవ్వలేదు. పదోన్నతులు, బదిలీలు చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత డిసెంబర్​ 29న పదోన్నతులు, బదిలీలకు ఆదేశాలిచ్చారు. 31న ఉద్యోగ సంఘాలతో మధ్నాహ్న భోజనం చేసి పీఆర్సీ నివేదిక ఇవ్వాలని, జనవరిలో పీఆర్సీపై తేల్చాలని ఆదేశించారు. జనవరి దాటిపోయింది. పీఆర్సీ అంశం తేలలేదు. బిస్వాల్​ కమిషన్​ ఫిట్​మెంట్​ను 7.5 శాతానికి మాత్రమే సూచించింది. సీఎం కేసీఆర్​దే తుది నిర్ణయమని, సీఎంను కలిసి మెరుగైన ఫిట్​మెంట్​ సాధిస్తామని జేఏసీ ప్రకటించింది. సీఎంను కలిసేందుకు జేఏసీ తరుపున అపాయింట్​మెంట్​ అడుగుతూనే ఉన్నారు. రిప్లై లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఫిట్​మెంట్​ 30 శాతం వరకు ఇచ్చినా సంతృప్తి ఉండదని, ప్రభుత్వానికి ఫాయిదా ఏముండదని సీఎంకు సలహాదారులు నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ ప్రకటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

అన్నీ అప్పుడే..

ఫిట్​మెంట్​తో పాటు పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలన్నీ కొత్త ఆర్థిక సంవత్సరంలోనే ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​ కసరత్తులో నిమగ్నమైంది. ఈ నెల 15వరకు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​ వస్తుందని ప్రచారం జరుగుతోంది. తర్వాత నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక, మినీ పురపోరుకు నోటిఫికేషన్​ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఏప్రిల్​ వరకు పీఆర్సీపై సీఎం కేసీఆర్​ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాలతో భేటీ కావడం లేదు. 70కిపైగా ఉద్యోగ సంఘాలు తమకు కూడా చర్చలలో అవకాశం ఇవ్వాలని కోరాయి.వారందరినీ పిలుస్తామన్నారు. ఎలాంటి సమాచారం లేదు. సీఎం కేసీఆర్​ నేరుగా ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని కూడా అనుకుంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల్లో మల్లగుల్లాలు..

పీఆర్సీ అంశం ఉద్యోగ సంఘాల మెడకు చుట్టుకుంది. ఇప్పటి వరకు సీఎంను కలుస్తాం, మెరుగైన ఫిట్​మెంట్​ సాధిస్తామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. త్రిసభ్య కమిటీ మాత్రం చర్చలకు ముందుగా గుర్తింపు పొందిన సంఘాలతో మాత్రమేనని, ఇప్పుడు అన్ని సంఘాలకు సమయమిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలలో ఒక్కసారిగా వర్గపోరు మొదలైంది. ఆలస్యానికి మీరంటే మీరే కారణమంటూ విమర్శలు చేసుకుంటున్నారు. కిందిస్థాయి ఉద్యోగులను ఎలా కన్విన్స్​ చేయాలనేదే అంతు చిక్కడం లేదు. ఫిట్‌మెంట్‌పై బయట జరుగుతున్న ప్రచారంతో ఉద్యోగుల గుండెలు గుభేల్‌ మంటున్నాయి. ఫిట్‌మెంట్‌లో తేడా వస్తే ఉద్యోగులు తమ జుట్టు పట్టుకుంటారని ఉద్యోగ సంఘాలు వణుకుతున్నాయి. సీఎంతో టచ్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ఆవేదనను సీఎంకు చెప్పడం సాధ్యం కావడం లేదని కుమిలిపోతున్నారు.: పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే కార్మికురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటుక బట్టీ నిర్వహకులే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ మేరకు సఖీ కేంద్రానికి సమాచారం అందడంతో ఆర్డీవో ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పీఆర్సీ.. నో క్లారిటీ.. ప్రభుత్వం చెక్ పెట్టిందా..?

Advertisement

Next Story