స్వీయ జాగ్రత్తలతో వైరస్ దూరం: గవర్నర్

by Shyam |
స్వీయ జాగ్రత్తలతో వైరస్ దూరం: గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ సృష్టించిన టెన్షన్ ఎలా ఉన్నా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించడంతో ప్రాణనష్టాన్ని తగ్గించుకోగలిగామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అప్రమత్తమై రంగంలోకి దిగడం కూడా మంచి చేసిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ఎన్ని రకాల వైరస్‌లు, వాటి స్ట్రెయిన్‌లు వచ్చినా మనం తగిన నియంత్రణ చర్యలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌గా ఉండొచ్చన్నారు. ముఖానికి మాస్కు ధరించడం, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి ఎప్పుడూ శ్రేయస్కరమన్నారు. ట్విట్టర్ వేదికగా నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పిన గవర్నర్ ఇప్పటివరకూ పాటించిన జాగ్రత్తలనే ఇంకొంత కాలం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినా ఈ జాగ్రత్తలను పాటించడం ఉత్తమమన్నారు. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్టుల గురించి కొద్దిమందిలో ఆందోళన ఉందని, కానీ అలాంటివి తాత్కాలికమేనని, ప్రాణానికి ప్రమాదం చేకూర్చేంత స్థాయిలో ఉండవన్నారు. మూడవ దశ ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రజల ప్రాణాల రక్షణ కోసమే వేగంగా స్పందిస్తోందన్నారు. కరోనా సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ లాంటి ఎన్ని భయాలు ఉన్నా సకాలంలో ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అవగాహన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సూచనలను తు.చ. తప్పకుండా పాటించినంతకాలం సురక్షితంగా ఉండొచ్చన్నారు.

వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషిస్తోందని, దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌లను అందించడం అభినందనీయమన్నారు. కరోనా కలిగించే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ పరిశోధన, తయారీపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి వచ్చే వీలు కలిగిందన్నారు.

Advertisement

Next Story