సెక్యులరిజానికి గుర్తు తెలంగాణ: తమిళిసై

by Shyam |
సెక్యులరిజానికి గుర్తు తెలంగాణ: తమిళిసై
X

దిశ, న్యూస్‌బ్యూరో : గంగా యమున తెహజీబ్‌గా వర్ధిల్లుతూ… సెక్యులరిజానికి తెలంగాణ సింబల్‌గా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ప్రశాంతంగా ఉండే తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉండడం సత్ఫలితాలనిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ లీడర్ షిప్‌లో తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువ టైంలోనే అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడున్న పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఇంత తక్కువ వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి దేశం అబ్బురపడుతున్నదని వెల్లడించారు.

60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ కోతలు, తీవ్ర నీటి కొరత సమస్యలు ఎదుర్కొందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి పేద ప్రజలకు కనీసం జీవన భద్రత లేకుండా పోయిందని, ఆత్మహత్యలు, వలసలు, ఆకలిచావులు నిత్యకృత్యంగా ఉండేవన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనైన వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే దుర్భర పరిస్థితులుండేవని గుర్తు చేశారు. అయితే తక్కువ కాలంలోనే వాటిని అధిగమించిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు.
చివరకు ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్ప రాజ్యం అని తమిళ కొటేషన్ చదివిన గవర్నర్ జైహింద్, జైతెలంగాణ అని నినదిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

tags : governor speech, telangana government, assembly budget session, recession

Advertisement

Next Story