ప్రయోగాత్మకంగా 'ఈ-ఆఫీస్'

by Anukaran |   ( Updated:2020-07-18 09:46:20.0  )
ప్రయోగాత్మకంగా ఈ-ఆఫీస్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు కుంటుపడడంతో ఇంటి నుంచే నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఈ-ఆఫీస్’ విధానానికి శ్రీకారం చుట్టింది. తొలి దశలో సాధారణ పరిపాలన, ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్ఏ తదితర ఆరు శాఖల్లో, విభాగాల్లో నూతన విధానం ప్రయోగాత్మకంగా శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, సాగునీటిపారుదలశాఖలోని కొన్ని విభాగాల్లో అమలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్ఱభుత్వం ఇకపైన అన్ని శాఖలు, విభాగాల్లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని భావించింది. అందులో భాగంగా ఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

ఈ విధానం అమలులోకి తీసుకురావడంపై ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, కొత్త విధానం ద్వారా ఆయా విభాగాల్లో వివిధ స్థాయిల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని, పనులు సత్వరం పూర్తవుతాయని, కాగితాల వినియోగం తగ్గుతుందని, నిర్దిష్టంగా ఒక ఫైల్ ఎక్కడ ఉందో, ఏ దశలో ఉందో సంబంధిత అధికారులు ఎక్కడినుంచైనా చూసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed