ఎల్ఐసీపై కేంద్రం కీలక నిర్ణయం

by Harish |
ఎల్ఐసీపై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఐపీవోను తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. సంస్థ అధీకృత ములధనాన్ని గణనీయంగా రూ. 25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదన చేసింది. దీంతో, రూ. 10 ముఖ విలువ ఉన్న 2500 కోట్ల షేర్లు ఐపీవోకు రానున్నాయి. నిబంధనల ప్రకారం.. ఒకేసారి పబ్లిక్ ఇష్యూకు రావాల్సిన అవసరం లేదు. దశలవారీగా షేర్లను విక్రయించవచ్చు.

ప్రస్తుతం 29 కోట్లకు పైగా పాలసీలతో ఎల్ఐసీ సంస్థ పెయిడ్-అప్ కేపిటల్ రూ. 100 కోట్లుగా ఉంది. ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. ఎల్ఐసీ సంస్థ అధీకృత వాటా మూలధనం రూ. 25 వేల కోట్లుగా ఉంటుంది. ఈక్విటీ షేర్ రూ. 10 ముఖ విలువతో 2,500 కోట్ల షేర్లను విభజించే వీలుంటుంది. తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనల ప్రకారం, ఎల్ఐసీ లిస్టింగ్ నిర్వహణకు స్వతంత్ర డైరెక్టర్లతో ఒక బోర్డ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

లిస్టింగ్ అనంతరం 5 ఏళ్ల వరకు సంస్థలో 75 శాతం వటా ప్రభుత్వం వద్దే ఉండనుంది. తర్వాత ప్రభుత్వం శాశ్వతంగా 51 శాతం వాటాను ఉంచుకుని నియంత్రణను కలిగి ఉంటుంది. ఇందులో చందాదారులకు 10 శాతం వాటాలను రిజర్వ్ చేయనున్నారు. 1956లో రూ. 5 కోట్ల ప్రారంభ మూలధనంతో మొదలైన సంస్థ ప్రస్తుతం రూ. 31,96,214 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కాగా, ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎల్ఐసీ ఐపీవోను తీసుకురానున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story