హమ్మయ్య.. అప్పు పుట్టింది

by Anukaran |   ( Updated:2021-04-07 11:23:42.0  )
RBI TS
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకావడంతో అన్ని రాష్ట్రాలూ రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు (స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్) తీసుకోడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏప్రిల్-జూన్ క్వార్టర్ (మూడు నెలల కాలం)లో రూ. 8,000 కోట్లు తీసుకోడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు సమాచారం అందించింది. ఏప్రిల్ నెలలో రెండు విడతల్లో రూ. 2000 కోట్లు, మే నెలలో రెండు విడతల్లో రూ. 3,000 కోట్లు, జూన్ నెలలో రెండు విడతలుగా రూ. 3,000 కోట్ల చొప్పున రుణాలు తీసుకునేలా ప్రణాళిక దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతానికి క్వార్టర్లీ క్యాలెండర్ ప్రకారం ఈ మేరకు అప్పులు తీసుకోడానికి రిజర్వుబ్యాంకుకు సమాచారం ఇచ్చింది. అయితే అంతకన్నా ఎక్కువ అవసరం ఏర్పడితే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 47,500 కోట్లను రుణంగా తీసుకోవాలని అంచనా వేసింది. సగటున ప్రతీ క్వార్టర్‌కు రూ. 12 వేల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులు కాస్త మెరుగ్గా ఉండడంతో రూ. 8,000 కోట్ల మేరకే సిద్ధమవుతోంది. గతేడాది ఇదే మూడు నెలల కాలానికి రూ. 12,461 కోట్లు అప్పు తీసుకుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలుకావడంతో రాష్ట్రానికి ఆదాయమే లేకుండా పోయింది. దాంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతితో ఎక్కువ రుణం తీసుకోక తప్పలేదు. గతేడాది రూ. 34 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా రూ. 43,784 కోట్లను తీసుకుంది. ఈసారి మొత్తం రూ. 47,500 కోట్లను తీసుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా తొలి క్వార్టర్‌ లెక్క తేలింది.

ఒకవైపు పాలమూరు-రంగారెడ్డి సహా దక్షిణ తెలంగాణలోని పలు ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇప్పుడు రుణంగా సమకూర్చుకుంటున్నందున ప్రభుత్వానికి ఒకింత వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుకు ప్రతీ నెలా రూ. 800 కోట్ల మేర ఖర్చవుతున్నందున రిజర్వుబ్యాంకు నుంచి సమకూర్చుకుంటున్న మొత్తంలో దాదాపు సగం ఆ అవసరాలకే సరిపోనుంది. ఆర్థిక శాఖ కూడా ఫిట్‌మెంట్ భారాన్ని రుణం ద్వారా సమకూర్చుకుంటున్న మొత్తం నుంచే ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిట్‌మెంట్ కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ. 9,870 కోట్ల మేర భారం పడనుంది.

తెలంగాణ తీసుకోవాలనుకుంటున్న రుణాలు

ఏప్రిల్ 15 – రూ. 1,000 కోట్లు
ఏప్రిల్ 27 – రూ. 1,000 కోట్లు
మే 11 – రూ. 2,000 కోట్లు
మే 24 – రూ. 1,000 కోట్లు
జూన్ 8 – రూ. 2,000 కోట్లు
జూన్ 29 – రూ. 1,000 కోట్లు

Advertisement

Next Story