ఆ పాపంలో మీరు కూడా దోషులే!

by Shyam |   ( Updated:2020-08-03 22:29:28.0  )
ఆ పాపంలో మీరు కూడా దోషులే!
X

దిశ, న్యూస్ బ్యూరో: నకిలీ సోయా విత్తనాల వ్యవహారంలో అంతా కలిసిపోతున్నారు. రైతులను నిండా ముంచుతున్నారు. కంపెనీలు అధికారులకు ఆశ చూపిస్తున్నాయి. అధికారులు కూడా కంపెనీల మాయలో పడిపోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నకిలీ సోయా విత్తనాల కేసులో వ్యవసాయ శాఖ ఐదు ప్రభుత్వం సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంది. విత్తనాల కోసం అగ్రిమెంట్లు చేసుకున్న రాష్ట్ర, జాతీయ విత్తన సంస్థలు, హాకా, ఆయిల్‌ఫెడ్‌తోపాటు పలువురికి ఈ నోటీసులు అందాయి. విత్తన కంపెనీలలో ఉన్నతాధికారులకు వాటాలు ఉండటం, కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్ట్ నర్లుగా వ్యవహరిస్తుండటం, మరికొందరికి ఏటేటా భారీగా నజరానాలు అందడం తదితర కారణాలతో నకిలీ విత్తనాలు యథేచ్ఛగా మార్కెట్‌లోకి వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే వ్యవసాయ శాఖ జారీ చేసిన నోటీసులకు ఆయా సంస్థలు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు. పైగా కంపెనీలకు సంబంధించిన సిబ్బంది గ్రామాల్లో రైతులను బెదిరిస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. మొలకెత్తకున్నా, విచారణ సమయంలో మొలకెత్తాయని చెప్పాలని, ఎంతో కొంత ఇస్తామని, లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటార ని హెచ్చరిస్తున్నట్టు సమాచారం.

విచారణలో విత్తన కంపెనీల పెత్తనం

నకిలీ సోయా విత్తనాలు లక్షకుపైగా ఎకరాల్లో మొలకెత్త లేదు. దీంతో వ్యవసాయ శాఖ విచారణ జరిపింది. నిర్మల్ జిల్లాలో 36,367 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 2,961 ఎకరాలు, ఆదిలా బాద్ జిల్లాలో 1,382 ఎకరాలు, సంగారెడ్డిలో 300 ఎకరాలు, కామారెడ్డిలో 400 ఎకరాల్లో సోయా మొలకెత్తలేదని గత నెలలో ప్రాథమిక నివేదికను ఇచ్చింది. నిజానికి ఈ లెక్కలన్నీ అబద్ధ మని, క్షేత్రస్థాయిలో అసలు పరిశీలనే జరపలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతు సంఘాలు గ్రామాలవారీగా పరిశీలించి పూర్తి వివరాలతో మరో నివేదిక ఇచ్చాయి. 1.10 లక్షల ఎకరాలలో సోయా విత్తనాలకు మొలకలు రాలేదని అందులో పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశించింది. మండలస్థాయిలో తహశీల్దార్ పరిశీలన జరపాలని, ఆర్డీఓలు ధ్రువీకరించిన తరువాత కలెక్టర్ ఆమోదముద్రతో తుది నివేదికను పంపించాలని సూచించింది.

ఈ సమయంలోనే విత్తన కంపెనీల పెత్తనం మొదలైంది. కంపెనీలు, సీడ్ ఎజెన్సీల ప్రతినిధులు రైతులను భయపెట్టే పనిలో పడ్డారు. పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఓ మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు దిగారు. విత్తనాలు నాణ్యమైనవేనని చెప్పాలని వెంటపడ్డారు. ఈ ప్రభావంతోనే ముందుగా సోయా మొలకెత్తని ఎకరాలు 41,410 అని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ప్రస్తుతం దాన్ని 37 వేల ఎకరాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. మరింత తగ్గించేందుకు కూడా చివరి ప్రయ త్నాలు చేస్తున్నారు. విత్తన కంపెనీలతో టీఎస్ ఎస్‌డీసీ, మార్క్ ఫెడ్, హాకా, ఆయిల్‌ఫెడ్, ఎన్ఎస్‌సీ మధ్య అగ్రిమెంట్, టెండర్లు జరిగాయి. వ్యవసాయ శాఖ నేరుగా తమ ప్రమేయం లేదనే సాకుతో తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. వ్యవహారం తీవ్రరూపం దాల్చుతుండటంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story