- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షకులెవరు?
ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఎవరు కాపాడుతారు? భూముల ధరలు మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరా కనీసం రూ.10 లక్షలు పలుకుతున్న తరుణంలో మరింత అప్రమత్తత అనివార్యం. లక్షలాది ఎకరాల భూములను సంరక్షించేదెలా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దుతో భూ పరిపాలన గందరగోళంలో పడింది. సాంకేతికతను వినియోగించి రెవెన్యూ రికార్డు లను ఆధునీకరిస్తున్న నేపధ్యంలో వీఆర్వో పోస్టు అవసరం లేనిదిగా భావించారు. ఈ క్రమంలో గ్రామస్థాయిలో భూముల ఆలపాపాలనా చూసేదెవరన్న ప్రశ్న ఎదురవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇండ్లను కూల్చేసినందుకు వీఆర్వో శ్యాంపై తిట్ల వర్షం కురిపించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉదంతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలేవీ మిగల్లేదనడానికి అవకాశం లేదు. అన్ని గ్రామాల్లో ప్రకృతి వనం, శ్మశానవాటికలకు ప్రభుత్వ జాగలను కేటాయించారు. ఆ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఊరిలోనూ ప్రభుత్వ భూములు ఉండడం ఖాయం. ఏ ఊరి రెవెన్యూ రికార్డులు చూసినా కొద్దోగొప్పో భూములు తప్పనిసరిగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని కాపాడే ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపొందించకుండా వీఆర్వో పోస్టులను రద్దు చేయడం పట్ల విమర్శలు తలెత్తతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని విస్తీర్ణాలకు, క్షేత్ర స్థాయిలోని విస్తీర్ణాలకు పొంతనే లేదు. సగానికి పైగా అదృశ్యమయ్యాయి. ఆ కాస్త స్థలాలు కూడా బలమైన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే రక్షణ ప్రశ్నార్ధకమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టంలో మార్పులు చేసి అమల్లోకి తీసుకొచ్చిన ‘తెలంగాణ భూముల హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020’ లో ఈ అంశాలను పేర్కొనలేదు. నెల రోజులుగా దాని అమలుకు నిబంధనలను రూపొందించేందుకు సీఎంఓ, సీసీఎల్ఏ కార్యాలయాల్లో కుస్తీలు పడుతోన్న మేధావులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.
తహశీల్దార్లు దసరా నుంచి ద్విపాత్రాభినయం పోషించనున్నారు. ఉదయం జాయింట్ రిజిస్ట్రార్ , మధ్యాహ్నం తహశీల్దార్ పాత్రను నిర్వహించనున్నారు. ఇక రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు పది గ్రామాలకు పైగానే ఉన్నాయి. వీఆర్ఏలలో 58 సంవత్సరాలకు పైబడిన వారే అధికం. డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలు మాత్రమే సమర్ధవంతంగా పని చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారిలో చాలా మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వారే. విద్యావంతులు చాలా తక్కువ. కబ్జాలను ఎదుర్కొనే శక్తి సరిపోదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలను నిరోధించేది ఎవరన్న విషయం స్పష్టం కావాలి. ఎమ్మెల్యే వివేకానంద వీఆర్వో, తహసీల్దార్ ను దూషించిన ఘటనలో స్పందించిన ట్రెసా నాయకులు ప్రభుత్వ భూములను కాపాడేందుకు సరిపడా స్టాఫ్ లేరని స్పష్టం చేశారు.
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో సర్వ నంబరు 79లో నిర్మాణాలు వచ్చాయి. దీని వెనుక నోటరీ వ్యవస్థ బలంగా నడిచింది. ప్రతి ప్లాటు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఓ కార్పొరేటర్, ప్రధాన పార్టీ నాయకుడు ఉన్నట్లు సమాచారం. కరెంటు మీటర్ల నంబర్ల ఆధారంగా అవెక్కడి నుంచి వచ్చాయో, ఎవరు కనెక్షన్లు ఇచ్చారో తెలుస్తుందంటున్నారు. పాత ఇండ్లలోని మీటర్లను అప్పటికప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇండ్లకు అమర్చినట్లు ఆరోపిస్తున్నారు. కొత్త ఇండ్లల్లో వృద్ధులను, దివ్యాంగులను కూర్చోబెట్టి తతంగాన్ని నడుపుతున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలను తొలగించొద్దన్న ఆదేశాలను కిందిస్థాయి ఉద్యోగులకు ఇప్పించడం ద్వారా వారికి మేలు కలుగుతుందని ప్రజాప్రతినిధులకు మెలిక పెడుతున్నారు.
జగద్గిరిగుట్టలో సర్వే నం.348/1లో 700 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. మూడు మండలాల మధ్యనున్న ఈ స్థలంపై వివాదాలే అక్రమార్కులకు వరంగా మారా యి. ఒక్క నాయకుడే కీలకంగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనే నేరుగా నోటరీ ద్వారా విక్రయించారని తెలిసింది. నోటరీలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ప్లాట్లు చేతులు మారుతున్నాయి. అనేక నిర్మాణాలు వచ్చేశాయి. ఖైసర్ నగర్ లో సర్వే నం.342లో 280 ఎకరాలు, 349/1లో వందలాది ఎకరాలు, దేవేందర్ నగర్ పేరిట సర్వే నంబరు 329 లో క్రయ విక్రయాల దందా యథేచ్ఛగా సాగుతోంది. సర్వే నంబరు 307లో రాష్ట్ర ఆర్ధిక సంస్థకు 117 ఎకరాల భూమి ఉన్నది.
పొరుగు సర్వే నంబర్లతో నోటరీలు రాసిచ్చి ప్లాట్లను రూ.లక్షలకు విక్రయించారు. గాలి మైసమ్మ బస్తీ పేరుతో గుడిసెలు వేయించారు. వాటిలో కొన్నింటిని తొలగించారు. రావి నారాయణరెడ్డినగర్, బాలయ్యనగర్, నర్సింహ బస్తీలు కూడా అదే కోవకు చెందినవే. జవహర్ నగర్, కీసర ప్రాంతాల్లోనూ వందలాది ఎకరాలను పక్క సర్వే నంబర్లతో దందా నడిపిస్తూనే ఉన్నారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని గ్రామాల్లోనూ ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఇప్పుడక్కడ గజం రూ.25 వేల వరకు పలుకుతుండడం గమనార్హం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తే తప్ప పరిస్థితి అదుపు లోకి రాదు. ఇలా నగర శివార్లలో ప్రభుత్వ భూముల్లో దందా నడుస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారానే చట్టబద్ధత కల్పిస్తుందన్న భరోసాను ఇస్తున్నారు. ఈ క్రమంలో గల్లీ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అనుచరగణం క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.