21రోజుల లాక్‌డౌన్..రూల్ బుక్ ఇదే!

by Shamantha N |
21రోజుల లాక్‌డౌన్..రూల్ బుక్ ఇదే!
X

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. వైరస్‌ను అరికట్టేందుకు దీనికంటే విలువైన మార్గం లేదని, ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎవరైనా దీన్ని అనుసరించకపోతే భారీ నష్టాలను చూడాల్సి వస్తుందన్నారు. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. బడా పారిశ్రామికవేత్తలు సైతం దేశ రక్షణ కోసం తమ సంస్థల ఉత్పత్తులను, కార్యకలాపాలను నిలిపేశారు.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 18 వేల మరణాలు సంభవించిన నేపథ్యంలో సరిహద్దులను పూర్తీగా మూసేయడం జరిగింది. అత్యవసరమైన, నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ అవసరమైనంత మంది వైద్యులు లేని కారణంగా, దేశ ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదనే కేద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రూల్స్ ఏంటంటే:

మినహాయింపుల జాబితాతో పాటు, ఎవరైనా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం జైలు శిక్ష లేదంటే భారీ జరిమానా తప్పదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష లేదా జరిమానా, కొన్నిసార్లు రెండూ కూడా ఉండొచ్చు. ఎవరి నిర్లక్ష్యానికైనా ప్రాణ నష్టం జరగడం, ప్రమాదానికి దారితీస్తే రెండేళ్ల జైలు శిక్ష తప్పదు.

ఏదైనా వ్యక్తిగత ప్రయోజనం కోసం తప్పుడు సమాచారం ఇచ్చి బయట తిరిగితే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. నగదు, వస్తువులను నిల్వ ఉంచుకోవడం వంటివి చేసినా కూడా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు పెరిగే విధంగా తప్పుడు వార్తలను, సమాచారాన్ని అందిస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుందని చట్టం చెబుతోంది.

లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా తమ అధికారాలను దుర్వినియోగం చేయడమో, విఫలమవడమో జరిగితే సదరు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా, తగిన చట్టబద్ధమైన కారణం లేకుండా నిరాకరిస్తే ఒక ఏడాది జైలు శిక్ష లేదంటే జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పారిశ్రామికవేత్తల సూచనలు:

ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ చర్యల వల్ల ఉత్పన్నమయ్యే అంశాలను కొందరు పారిశ్రామిక వేత్తలు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న నిర్భంధం వల్ల ఉత్పన్నమయ్యే అంశాలను సూచించారు. దేశీయ ఆటో రంగం దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా..లాక్‌డౌన్ అత్యవసరమైన, తప్పనిసరి అని అన్నారు. అయితే, రోజూవారి కూలీలు, కారుమికుల జీవితాలకు ఇది పెనుసవాలు. తీవ్ర నష్టాలను, కష్టాలను వారు ఎదుర్కోవాలి. అందుకోసం మనమందరం ఆర్థికంగా వెనుకబడి వారికి రోజుకు అవసరమైన నిత్యావసర సరుకులను అందిద్దామని చెప్పారు.

లండన్‌లో కరోనాను తరిమి కొట్టేందుకు అక్కడ పాటిస్తున్న లాక్‌డౌన్ విధానాన్ని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ప్రస్తావించారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రభుత్వానికి సహరించేందుకు అక్కడి స్థానికు కొంతమంది ఇంటి కిటికీలకు ఆకుపచ్చ రంగు బోర్డులను పెడుతున్నారు. ఆ రంగు బోర్డు ఉన్న ఇంట్లోని వారికి అత్యవసరమైన సాయం కావాలంటే, నిత్యవసర వస్తువులు లేకపోతే, ఇంట్లోని వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆకుపచ్చ బోర్డు తీసేసి ఎరుపు రంగు బోర్డు పెడతారు. దీన్ని గమనించి పోలీసులు కానీ, సహాయక సిబ్బంది కానీ వారికి అవసరమైనవి కనుక్కుని తెచ్చిస్తున్నారు. ఈ విధంగా కరోనాపై ప్రత్యక్ష పోరాటాన్ని బ్రిటన్ పౌరులు నిర్వర్తిస్తున్నారని హర్ష ట్విటర్ ద్వారా వివరించారు. ఇలాంటి అవసరమైన ఆలోచనలతో మన దేశాన్ని మనమే రక్షించుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు.

21 రోజుల లాక్‌డౌన్ విషయంలో ప్రతీ పౌరుడు క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరించాలి. ఈ సమయంలో పోలీసులు ప్రజల పట్ల అత్యంత తీవ్రంగా స్పందించకూడదు. అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారందరికీ మినహాయింపు ఇచ్చే ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ మజుందార్ వివరించారు.

Tags: India Lockdown Guidelines, Narendra Modi, Lockdown Violation, 21 Day Lockdown, Coronavirus, Lockdown Punishment

Advertisement

Next Story

Most Viewed