ప్రభుత్వ నిధులు సగం వాటికే..!

by Anukaran |   ( Updated:2020-11-01 21:03:26.0  )
ప్రభుత్వ నిధులు సగం వాటికే..!
X

పంచాయతీలకు ప్రభుత్వం షాకిచ్చింది. నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని దారి మళ్లిస్తోంది. జీపీల మీద భారం మోపుతోంది. ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణను ఇంధన పొదుపు సేవా సంస్థ (ఈఈఎస్ఎల్)కు అప్పగించింది. ఈ నిర్ణయం అధికార పార్టీ నేతలకు నెలనెలా ఆదాయం సమకూరేలా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఈఎస్ఎల్ నుంచి మండలాలవారీగా స్థానిక నేతలకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. పెత్తనం అంతా గులాబీ నేతలదే కారుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాలలో వీధి దీపాల భారాన్ని కూడా త్వరలో ప్రజలపై వేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటి పన్ను, నల్లా పన్నుతోపాటు వీధి దీపాల నిర్వహణ పన్ను కూడా వసూలు చేయనున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే పరిమితమైన ఈఈఎస్ఎల్ వ్యవస్థక గ్రామాలకు కూడా పాకుతోంది. ఇక ప్రతినెలా బిల్లులు చెల్లిస్తేనే గ్రామాలలో వీధి దీపాలు వెలుగనున్నాయి. ఇప్పటికే అరకొర నిధులు, అష్టకష్టాలతో తల్లడిల్లుతున్న గ్రామ పంచాయతీలకు ఇది గుదిబండ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు ఎంతో కొంత కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు నెలకు రూ.339 కోట్లు ఇస్తోంది. ఈ నిధులు ఎటూ సరిపోవడం లేదు. మల్టీపర్పస్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ. 8,500 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. కొన్ని గ్రామాలకు ఈ నిధులు వేతనాలకే సరిపోతున్నాయి. పంచాయతీల నిర్వహణ, ట్రాక్టర్ నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ వంటివి ఆర్థిక భారంగా మారుతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను వాడుకోవాల్సి వస్తోంది.

నిర్వహణ మొత్తం వారిదే..

ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే వీధి దీపాలను ఇక నుంచి ఈఈఎస్ఎల్ నిర్ణయించనుంది. సంస్థ నుంచే ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని అమర్చడం, నిర్వహణ ఖర్చులు ప్రతి నెలా పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రాత్రిపూట మాత్రమే వెలిగేలా ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలను పంపించాలని ప్రభుత్వం గతనెల 28న ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై గ్రామ ప్రజాప్రతినిధులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలను ఈఈఎస్ఎల్‌కు అప్పగిస్తే వాటి నిర్వహణకు సంబంధించి సమస్యలపై ప్రజలు నిలదీస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర్మానాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. నాలుగు జిల్లాలు మినహా, మిగిలిన చోట నుంచి తీర్మానాలు ఇవ్వడం లేదు. సిద్ధిపేట, రంగారెడ్డి, నారాయణపేట, జనగామ జిల్లాల నుంచి కొంత మేరకు తీర్మానాలు వచ్చాయి. ఈ ప్రక్రియను సొంత పార్టీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు.

సగం సొమ్ము లైట్ల కోసమే..

ఇప్పటి విద్యుత్ దీపాల కోసం పంచాయతీలు దాదాపు రూ.312 కోట్లు చెల్లించాల్సి వస్తోందని అంచనా. ప్రతినెలా 110 యూనిట్ల చొప్పున పంచాయతీలు ఎల్ఈడీ వీధి దీపాల కోసం ఈఈఎస్ఎల్‌కు రూ.193 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కలేశారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులలో సగానికిపైగా ఈఈఎస్ఎల్ పేరుతో స్థానిక నేతలకే కట్టబెట్టనున్నారు. ప్రస్తుతం బిల్లులు పంచాయతీలే చెల్లించాలని అంటున్నా, ప్రజల నుంచి లైటింగ్ పన్ను వసూలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 17 రకాల పన్నుల మూడో జాబితాలోనే లైటింగ్ పన్నును విధించనున్నారు. వాస్తవంగా దీపాల నిర్వహణ ఈఈఎస్ఎల్‌కు అని చెబుతున్నా. గులాబీ నేతలకు ఆర్థిక లాభం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారనే అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed