మావోయిస్టుల వేటకు మరో పోలీస్ ఫోర్స్.. రిక్రూట్‌మెంట్‌కు సర్కార్ రెడీ!

by Sridhar Babu |
bastar-Fighters
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలన కోసం మరో స్పెషల్ పోలీస్ ఫోర్స్ రాబోతోంది. బస్తర్ ఫైటర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బస్తర్ డివిజన్(జోన్) పరిధిలోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కొండగావ్, కాంకేర్, బస్తర్, నారాయణపూర్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకి 400 మంది వంతున 7 జిల్లాల్లో కలిపి 2,800 మంది యువకుల నియామకానికి ఈనెల 26న హోంశాఖ అనుమతి లభించింది.

ఏడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక దళంలో డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు నియామకాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఈ రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలకు సంబంధించిన నిబంధనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. బస్తర్ ఫైటర్స్ స్పెషల్ ఫోర్స్‌కు అనుమతి లభించినట్లు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపారు.

బస్తర్ యువతకు ఉద్యోగ అవకాశం..

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలన కోసం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) పనిచేస్తుండగా ఇప్పుడు బస్తర్ ఫైటర్స్ పేరుతో కొత్త పోలీస్ ఫోర్స్ రాబోతోంది. దీని వలన మావోయిస్టుల కార్యకలాపాల నిర్మూలనే కాకుండా బస్తర్ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆ ప్రాంత భాష (స్థానిక మాండలికం) తెలిసిన వారిని ఈ ఫోర్స్‌లో రిక్రూట్ చేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బడ్జె‌ట్‌లోనే ఈ స్పెషల్ ఫోర్స్ గురించి ప్రకటన చేయడంతో నోటిఫికేషన్ కోసం యువత ఎదురుచూస్తున్నారు. ప్రతీ జిల్లాలో ఒక డిప్యూటీ సూపరింటెండెంట్, ఐదుగురు ఇన్‌స్పెక్టర్స్, 8 మంది సబ్ ఇన్‌స్పెక్టర్స్, 11 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్‌తోపాటు 75 మంది హెడ్ కానిస్టేబుల్స్, 300 మంది కానిస్టేబుల్‌ పోస్టుల నియామకం జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed