సక్సెస్‌ఫుల్ వ్యాక్సినేషన్‌పై మూడు నెలల ఫ్రీ రీఛార్జ్.. నిజమా?

by Shyam |
whatsapp
X

దిశ, ఫీచర్స్ : ‘కోవిడ్’ విషయంలో వైరల్ అవుతున్న అనేక వార్తలు ప్రజలను మిస్ లీడ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌కు సంబంధించి ఇండియా మైల్‌స్టోన్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 3 నెలల ఉచిత రీఛార్జ్‌ను అందిస్తుందనే న్యూస్ ఇటీవల కాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లేదా Vi కనెక్షన్ ఉంటే.. ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని, మీరు దిగువ లింక్‌పై క్లిక్ చేస్తే రీఛార్జ్ అయిపోతుందని, ఈ ప్రమోషన్ డిసెంబర్ 20 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందనేది ఆ మెసేజ్ సారాంశం. ఇలాంటి బోగస్ వాట్సాప్ సందేశాలను విశ్వసించవద్దని కేంద్ర ప్రభుత్వ వాస్తవ తనిఖీ బృందం ప్రజలకు తెలియజేసింది.

వైరల్ అవుతున్న రీఛార్జ్ ఫేక్ న్యూస్‌పై ప్రభుత్వం తాజాగా స్పందించింది. అటువంటి ప్రకటనేదీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో‌(పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ నోటిఫై చేసింది. అంతేకాదు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందేందుకు వైరల్ అవుతున్న మెసేజ్ ఇంటర్నెట్ లింక్‌ను మెన్షన్ చేస్తూ.. ‘ఇలాంటి నకిలీ సందేశాల లింక్‌పై మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు లేదా ఫార్వర్డ్ చేయొద్దు’ అని ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. గతంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా బోగస్ మెసేజెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులను హెచ్చరించింది.

‘ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించండి. ప్రభుత్వం లేదా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇలాంటి ఆఫర్ ఏదీ ప్రకటించలేదు. ఈ తరహా సందేశాలను షేర్ చేయొద్దు లేదా ఫార్వర్డ్ చేయొద్దు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అప్రమత్తం చేయండి’ అని COAI ట్వీట్ చేసింది.

Advertisement

Next Story